Begin typing your search above and press return to search.

ప‌ద్మావ‌త్ కు క‌ర్ణిసేన ఫిదా!

By:  Tupaki Desk   |   3 Feb 2018 7:44 AM GMT
ప‌ద్మావ‌త్ కు క‌ర్ణిసేన ఫిదా!
X

ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌తి` చిత్రం విడుద‌లపై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో రాణి ప‌ద్మావ‌తి దేవి పాత్ర‌ను వ‌క్రీక‌రించారని రాజ్ పుత్ లో ఆరోపించారు. ఆ సినిమాను నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ - హీరోయిన్ దీపికా పదుకొణేల‌ తలలపై రూ.10 కోట్ల నజరానా ప్రకటించ‌డ‌మే కాకుండా భ‌న్సాలీ తల న‌రుకుతామ‌ని - దీపికా ముక్కు కోస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఆ సినిమా విడుద‌లైతే శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌న్న ఉద్దేశంతో ప‌లు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ఆ సినిమాను బ్యాన్ కూడా చేశారు. ఎట్ట‌కేల‌కు చ‌రిత్ర‌కారుల క‌మిటీ - సెన్సార్ స‌భ్యులు ...ప‌ద్మావ‌తి సినిమా పేరును ప‌ద్మావ‌త్ గా మార్చ‌డంతో పాటు మ‌రికొన్ని మార్పులు చేయాల‌ని సూచించ‌డంతో ఆ సినిమా విడుద‌లైంది. అయిన‌ప్ప‌టికీ క‌ర్ణ‌సేన కొన్ని థియేట‌ర్ల‌పై దాడి చేయ‌డ‌డం - ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డం - బ‌స్సుల‌ను త‌గుల‌బెట్ట‌డం - స్కూల్ బ‌స్సుపై రాళ్లు విస‌ర‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ అడ్డంకుల‌ను అధిగ‌మించి సినిమా విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. తాజాగా, ఈ చిత్రంపై క‌ర్ణిసేన తొలిసారి పాజిటివ్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, పద్మావత్ సినిమా అద్భుతం, అమోఘం అంటూ పొగడ్తలు గుప్పించింది.

పద్మావత్ పై నానా ర‌చ్చ చేసిన క‌ర్ణ‌సేన ఎట్ట‌కేల‌కు త‌మ ఆందోళ‌న‌ల‌ను విర‌మించింది. శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించి.....ఆ చిత్రానికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ చిత్రంలో రాణి పద్మినీ - ఖిల్జీ మధ్య ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవని, రాజ్‌ పుత్‌ ల గురించి చాలా గొప్పగా చూపించారని కర్ణిసేన ముంబై చీఫ్‌ యోగంద్ర సింగ్‌ కటార్ అన్నారు. పద్మావత్‌ చూశాక ప్రతీ రాజ్‌ పుత్‌ కూడా గర్వపడతార‌ని కూడా చెప్పారు. ఈ సినిమాలో రాజ్‌ పుత్ ల మనోభావాలు దెబ్బతీయలేద‌న్నారు. అందుకే దేశ‌వ్యాప్తంగా త‌మ ఆందోళనలు విరమిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. రాజస్థాన్‌ - మధ్యప్రదేశ్‌ - గుజరాత్‌ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా సినిమా విడుద‌ల‌య్యేలా చూస్తామ‌న్నారు. ఈ విధంగా సినిమా చూసిన త‌ర్వాత క‌ర్ణ‌సేన త‌మ `ఆందోళ‌న‌`ల నిర్ణ‌యంపై యూటర్న్‌ తీసుకోవ‌డంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. భ‌న్సాలీ కూడా ఆ చిత్రంలో రాజ్ పుత్ ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా స‌న్నివేశాలు లేవ‌ని ముందునుంచి మొత్తుకుంటూనే ఉన్నార‌ని, క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు విని ఉంటే ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు వ‌చ్చేవి కాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.