Begin typing your search above and press return to search.

నాలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   26 Jan 2016 7:06 AM GMT
నాలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ రాజ‌మౌళి
X
రాజమౌళి మన తెలుగు దర్శకుడని గర్వంగా చెప్పుకుంటాం. తెలుగువాడి కీర్తిని నలు దిశలా చాటాడని వేనేళ్ల పొగిడేస్తాం. ఇప్పుడతడికి పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు కూడా మనందరం గర్వంగా ఫీలవుతున్నాం. కానీ ఆ పురస్కారానికి జక్కన్నను సిఫారసు చేసిందెవరో తెలిస్తే మాత్రం దిమ్మదిరగడం ఖాయం. ఎందుకంటే జక్కన్నను అవార్డుకు ప్రపోజ్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదీ కాదు.. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక అని సమాచారం.

మరి కర్ణాటకకు, జక్కన్నకు ఏంటి లింకు అంటే.. ఆయన పుట్టింది ఆ రాష్ట్రంలోనే మరి. ఐతే పుట్టింది కన్నడ రాష్ట్రంలోనే అయినా.. తెలుగు ఫ్యామిలీ కాబట్టి తెలుగువాడిగానే తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు. తెలుగు పరిశ్రమలోనే ఎదిగాడు. తెలుగు సినిమాలే తీసి ఇంత కీర్తి సంపాదించాడు. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రాంతీయ వైషమ్యాల పుణ్యమా అని.. జక్కన్న గురించే కాదు, తెలుగు సినీ పరిశ్రమ గురించే పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు నంది అవార్డుల గురించి పట్టంచుకునే నాథుడే లేని సంగతి తెలిసిందే. ఇక పరిశ్రమలోని వ్యక్తులకు సంబంధించిన మిగతా అవార్డుల గురించి పట్టించుకునేదెవ్వరు?

ఈ పరిస్థితుల్లోనే జక్కన్నను కర్ణాటక ప్రభుత్వం పద్మశ్రీకి సిఫారసు చేయడం.. కేంద్రం ఆయన ఇండియన్ సినిమా స్థాయిని పెంచేందుకు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు ప్రకటించడం జరిగిపోయాయి. ఐతే ఈ సందర్భంగా ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ చిత్రకారుడు, దర్శకుడు బాపును తమిళనాడు ప్రభుత్వం పద్మశ్రీకి ప్రతిపాదించిన సంగతీ గుర్తుచేసుకుని మనమంతా మరోసారి సిగ్గుపడాల్సిందే.