Begin typing your search above and press return to search.

విచారణలో 50 ప్రశ్నలు..అర్జున్‌ ఆన్సర్స్‌ ఇవే

By:  Tupaki Desk   |   7 Nov 2018 10:32 AM IST
విచారణలో 50 ప్రశ్నలు..అర్జున్‌ ఆన్సర్స్‌ ఇవే
X
మీటూ ఉద్యమంలో భాగంగా కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌ స్టార్‌ హీరో అర్జున్‌ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. లైంగిక ఆరోపణలపై అర్జున్‌ సీరియస్‌ గా స్పందించడంతో - శృతి మరో అడుగు ముందుకు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం - ఎఫ్‌ ఐ ఆర్‌ నమోదు చేయడం ఆ తర్వాత అర్జున్‌ ను విచారణకు పిలవడం - అర్జున్‌ విచారణకు వెళ్లడం అన్ని జరిగి పోయాయి. అర్జున్‌ విచారణకు వెళ్లిన నేపథ్యంలో అక్కడేం జరిగింది - పోలీసులు అర్జున్‌ ను ఏం ప్రశ్నించారు అనే విషయమై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది.

కన్నడ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు విచారణలో అర్జున్‌ పై దాదాపు 50 ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ఎక్కువగా శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణల గురించి సూటిగా అర్జున్‌ ను ప్రశ్నించారట. ప్రెసిడెన్సీ కాలేజ్‌ ఆవరణలో జరిగిన షూటింగ్‌ సందర్బంగా మీరు హీరోయిన్‌ హరి హరన్‌ ను లైంగికంగా వేదించారట నిజమేనా - ఆమె వీపుపు గిల్లి - బలవంతంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించారట నిజమేనా అంటూ ప్రశ్నించారట. అందుకు అర్జున్‌ సమాధానంగా ఆమెను తాను అసభ్యకరంగా తాకలేదు - ఆమె వీపుపై గిల్లలేదు. దర్శకుడు చెప్పిన విధంగా తాను చేశానంటూ చెప్పారట.

శృతిని మీరు పర్సనల్‌ గా కలవాలని - ఆమెను ఒక రెస్టారెంట్‌ కు రమ్మని పిలిచారట. ఒక వేళ మీరు చెప్పినట్లుగా రెస్టారెంట్‌ కు రాకుంటే కెరీర్‌ ను నాశనం చేస్తానంటూ బెదిరించారట నిజమేనా అంటూ పోలీసులు అర్జున్‌ ను ప్రశ్నించారట. అందుకు అర్జున్‌ సమాధానంగా నేను అలాంటి వ్యక్తిని కాదు. మీరు అడుగుతున్న ప్రశ్నల్లో ఏ ఒక్క విషయం కూడా జరగలేదు - నాపై నింధలు వేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నం అనిపిస్తుందని పోలీసుల వద్ద అర్జున్‌ చెప్పుకొచ్చారట.

విచారణ మొదటి దశ పూర్తి అయ్యిందని - మరో సారి త్వరలోనే అర్జున్‌ తో పోలీసు అధికారులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జున్‌ తన ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు నా గురించి పూర్తిగా తెలుసు. కనుక నాకు ఎలాంటి ఇబ్బంది లేదని - తనపై కుట్ర చేస్తున్న వారిని చూసి నేను భయపడను అంటూ చెప్పుకొచ్చారు .