Begin typing your search above and press return to search.

అఖిల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. అదే నిజ‌మైతే ద‌శ తిరిగిన‌ట్టే!

By:  Tupaki Desk   |   8 March 2022 6:30 AM GMT
అఖిల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. అదే నిజ‌మైతే ద‌శ తిరిగిన‌ట్టే!
X
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో త‌రంగా సినీ గ‌డ‌ప తొక్కిన అఖిల్ అక్కినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ.. అఖిల్‌కి అదృష్టం మాత్రం క‌లిసిరాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఈయ‌న చేసిన అఖిల్, హ‌లో, మిస్టర్ మజ్ను.. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

ఆ త‌ర్వాత వ‌చ్చిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మంచి విజ‌యం సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో విడుద‌లైన ఈ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ.. అఖిల్‌కు తొలి హిట్‌ను అందించింది.

ప్ర‌స్తుతం ఈయ‌న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో `ఏజెంట్‌` అనే మూవీ చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంకర భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌పైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. క‌ర‌ణ్ జోహార్ ఇప్ప‌టికే క‌థ‌ను సిద్ధం చేయించి ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడిని కూడా లైన్‌లో పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే అఖిల్ ద‌శ తిరిగిన‌ట్టే అని అంటున్నారు సినీ ప్రియులు.

కాగా, తెలుగు సినిమాల‌ను బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న‌ క‌ర‌ణ్ జోహార్.. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌స్తోన్న `లైగ‌ర్‌`కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగ‌స్టు 25న మొత్తం ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది.