Begin typing your search above and press return to search.

కరణ్ జోహార్‌ కు నిద్ర లేని రాత్రులు

By:  Tupaki Desk   |   24 Jan 2019 9:50 AM IST
కరణ్ జోహార్‌ కు నిద్ర లేని రాత్రులు
X
కరణ్ జోహార్ పుణ్యమా అని భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య - కేఎల్ రాహుల్‌ ల కెరీర్లు ప్రమాదంలో పడిపోయాయి. అతను నిర్వహించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొని కొన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు పూర్తిగా దూరమయ్యారు వీళ్లిద్దరూ. వీరి భవితవ్యం ఏంటో అర్థం కాకుండా ఉంది. వీరి కెరీర్లను ఇంతగా ప్రభావితం చేసిన కరణ్ ఎట్టకేలకు ఈ వివాదంపై నోరు విప్పాడు. తన వల్ల వీళ్లు ఇబ్బందుల్లో పడటంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సారీ చెప్పాడు కరణ్. జరిగిన దానికి పూర్తి బాధ్యత తనదే అని అతనన్నాడు.

‘‘నా షోలో ఇలా జరగడం నిజంగా దురదృష్టం. ఐతే మా మధ్య జరిగిన సంభాషణను నేను సమర్థించుకోవడం లేదు. ఆ షోలో ప్రతి ఒక్కరినీ అడిగే ప్రశ్నలే వాళ్లనూ అడిగా. అమ్మాయిల్ని కూడా అవే ప్రశ్నలు అడుగుతా. ప్రశ్నలు అడిగాక ఎలాంటి సమాధానాలు వస్తాయన్నది నా నియంత్రణలో లేని విషయం. ఐతే ఆ షో నాది.. వాళ్లిద్దరూ కేవలం ఆహ్వానితులుగా మాత్రమే వచ్చారు. కాబట్టి ఆ షో పూర్తి బాధ్యత కూడా నాదే. షో టెలికాస్ట్‌ అయ్యాక జరిగే పరిణామాలు నా చేతిలో ఉండవు. ఈ విషయంలో అదే జరిగింది. ఇలాంటి చేదు అనుభవం నా షో కారణంగా ఎదురైందని చాలా బాధ పడ్డాను. ఈ ఘటన నాకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చింది. వాళ్లకు జరిగిన నష్టాన్ని నివారించడానికి ఏం చేయాలా అని ఆలోచించా. కానీ నా మాట వినేదెవరు? ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది. నన్ను క్షమించండి’’ అని కరణ్ అన్నాడు. అందరూ ఈ షో టీఆర్పీ గురించి మాట్లాడుతున్నారని.. అది విషయం కాదని.. ఇక్కడ తనతో పాటు ఇద్దరు ఆటగాళ్ల కెరీర్లు ముడిపడి ఉన్నాయని కరణ్ అన్నాడు.