Begin typing your search above and press return to search.

కపూర్ ఫ్యామిలీ మొత్తం చెప్పేశారు

By:  Tupaki Desk   |   1 March 2018 6:27 AM GMT
కపూర్ ఫ్యామిలీ మొత్తం చెప్పేశారు
X
శ్రీదేవి అంకం పూర్తయిపోయింది. నిన్న అశేష జనవాహిని మధ్య జరిగిన అంతిమ యాత్రలో లక్షలాదిగా తరలివచ్చిన జనం మధ్య అందాల తార కడసారి వీడ్కోలు ఘనంగా తీసుకుంది. తను గతం అని ఒప్పుకోవడానికి ఏ సినిమా ప్రేమికుడు ఇష్టపడటం లేదు. శ్రీదేవి మరణ వార్త బయటి వచ్చిన క్షణం నుంచి కొన్ని మీడియా సంస్థలు చూపిన అత్యుత్సాహం - ఆమె వ్యక్తిగత జీవితంలోకి అవసరానికి మించి తొంగి చూసేందుకు చేసిన ప్రయత్నం ఇవన్ని అభిమానులను బాగా గాయపరిచాయి. ఆఖరికి దుబాయ్ లో ఉన్న భారతీయ అధికారులు కాస్త సంయమనం పాటించండి అనే చెప్పే దాక వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్ని కపూర్ కుటుంబం కూడా గమనించింది.

ముఖ్యంగా అనిల్ కపూర్ కుటుంబం - శ్రీదేవి కూతురు ఖుషి - అయ్యప్పన్-మేవార్ ఫ్యామిలీస్ ఇలా అందరికి దుబాయ్ లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి టీవీ మీడియా ఒక్కటే ఆధారంగా నిలిచింది. అందులో వచ్చిన వార్తలు - ఊహాజనిత కథనాలు వీరిని తీవ్ర మనస్తాపానికి గురి చేసాయి. అందుకే తమ మూడు కుటుంబాల తరఫున ఒక లేఖ - బోనీ కపూర్ తరఫున ఒక లేఖ విడుదల చేసిన ఆ ఫ్యామిలీ తమకు శ్రీదేవి అకాల మరణం ఎంత విషాదాన్ని ఇచ్చిందో వివరించే ప్రయత్నం చేస్తూనే మహానటికి ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా ప్రస్తావించారు.

మూడు కుటుంబాలు సంయుక్తంగా విడుదల చేసిన లేఖలో నటిగా - తల్లిగా - గృహిణిగా తన బాధ్యతలు నెరవేర్చిన శ్రీదేవి చాలా త్వరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసారు. ఈ విపత్కాలంలో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ జాహ్నావి - ఖుషిలకు తన తల్లి ప్రేమను మరిపించే ప్రేమను ఇవ్వాల్సిన బాధ్యత తమ మీద ఉందని స్పష్టం చేసారు. ఆ ఇద్దరికీ మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాద్యత తమతో పాటు అందరికి ఉందని గుర్తు చేసిన ఈ లేఖలో చివర్లో తమ కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరారు

ఇక బోనీ కపూర్ విడిగా రాసిన లేఖలో అందరికి తను చాందిని కావొచ్చు కాని తనకు మాత్రం ఒక ప్రేమికురాలు - స్నేహితురాలు - తన పిల్లలకు తల్లి అని పేర్కొన్నారు. తనకిప్పుడు తన పిల్లల పట్ల చాలా పెద్ద బాధ్యత ఉందని, శ్రీదేవి లేకుండా వాటిని నిర్వర్తించడం తనకు శక్తికి మించిన పని అని చెప్పిన బోని ఇకపై తమ జీవితాలు ముందులా ఉండవనే బాధతో లేఖను ముగించాడు. తనకు మద్దతు ఇచ్చిన మొదటి భార్య పిల్లలు అర్జున్ - అన్శులాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన బోని వాళ్ళ మద్దతుకు కరిగినట్టు మాటల్లో కనిపించింది. దూరం కావడం తాత్కాలికమే అన్న బోనీ చిరకాలం శ్రీదేవి వెండితెరపై బ్రతికే ఉంటుందని రాసుకున్నాడు.

బరువెక్కిన గుండెలతో శ్రీదేవి కుటుంబ సభ్యులు లేఖలో పొందుపరిచిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాము ఎంత క్షోభ అనుభవించామో మాటల్లో చెప్పుకున్న ఈ కుటుంబాలు ఇకపై తమను, శ్రీదేవి ఆత్మను ప్రశాంతంగా ఉండేలా గౌరవించమని కోరుకోవడం అందరిని కదిలించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి మొదటి సినిమా ధడక్ షూటింగ్ చివరి స్టేజి లో ఉంది. వాయిదా పడుతుందా లేక కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.