Begin typing your search above and press return to search.

తెలుగు తెర రాజమాత .. కన్నాంబ

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:00 PM IST
తెలుగు తెర రాజమాత .. కన్నాంబ
X
తెలుగు తెరపై నడయాడిన తొలితరం నటీమణులలో .. నవరసాలతో తెలుగు సినిమాను సస్యశ్యామలం చేసిన నటశిఖామణులలో 'పసుపులేటి కన్నాంబ' ఒకరు. తెలుగు సినిమా వైభవంలో .. తెలుగు సినిమా ప్రాభవంలో కన్నాంబ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కన్నాంబ ముందు కరుణరసం చేతులు కట్టుకుని నుంచునేది. వీరరసం ఆమె ఆదేశం కోసం కాచుకుని కూర్చునేది. ఆమె కనులెర్రజేసిందంటే ఆ ఎరుపు జీరలలో రౌద్రరసం కాపురముండేది. ఇక ఆమె కంచుకంఠం నుంచి వెలువడే డైలాగ్స్ వింటూ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యేవారు.

కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకి చొరవ .. ధైర్యసాహసాలు ఎక్కువ. ఊహతెలిసిన నాటి నుంచి ఆమెకి నాటకాలపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. 13 ఏళ్ల వయసులోనే ఆమె స్టేజ్ పై ఎలాంటి జంకు లేకుండా డైలాగులు చెబుతూ ఉంటే .. పద్యాలు పాడుతూ ఉంటే అంతా ఆశ్చర్యపోయేవారు. ఇక యుక్తవయసులోకి వచ్చేసరికి ఆమె తిరుగులేని నాటకానుభవాన్ని సంపాదించారు. ఆ తరువాత సహజంగానే ఆమె దృష్టి సినిమాలపైకి మళ్లింది. దాంతో ఆ దిశగా ఆమె అడుగులు పడ్డాయి.

అప్పట్లో సినిమాల్లో అవకాశం రావాలంటే రంగస్థల అనుభవం కావాలి. పాటలు .. పద్యాలు పాడగలగాలి. అలాంటివారినే తీసుకునేవారు. అందువలన సినిమాల్లో అవకాశాన్ని దక్కించుకోవడం కన్నాంబకి పెద్దగా కష్టం కాలేదు. 1935లో టి.ఎ. రామన్ దర్శకత్వంలో వచ్చిన 'హరిశ్చంద్ర' సినిమాలో 'చంద్రమతి' పాత్ర ద్వారా ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత 'ద్రౌపది వస్త్రాపహరణం' సినిమాలో 'ద్రౌపది' పాత్రను పోషించారు. ఇక ఆ తరువాత ఆమె కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు.

సాంఘికాలు .. పౌరాణికాలు .. చారిత్రకాలు .. జానపదాలలో పాత్ర ఏదైనా ఆమె తనదైన శైలిలో మెప్పించారు .. ఆ పాత్రలపై తనదైన ముద్రవేశారు. ఆమె స్వరం ఎంత కటువుగా మాట్లాడేదో .. అంతటి కరుణ రసాన్ని కురిపించేది. పాత్ర .. ఆ పాత్ర స్వభావాన్ని బట్టి ఆమె డైలాగ్స్ చెప్పే తీరును ఆ తరువాత కాలంలో కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు. వీరత్వం .. గంభీరత్వంతో కూడిన పాత్రలను ఆమె కన్నా గొప్పగా చేసి మెప్పించలేకపోయారు. ఆవేశం .. అసహనం .. ఆక్రోశంతో కూడిన పాత్రలతో ఆమె 'ఔరా!' అనిపించేవారు.

సాంఘికాలలో ఇంటిని చక్కబెట్టే ఇల్లాలి పాత్రలలో .. జానపదాలలో రాజమాత పాత్రలలో .. పౌరాణికాలలో దేవమాతగా .. చారిత్రకాలలో వీరమాతగా ఆమె చేసిన నవరస నట విన్యాసాన్ని ఎవరూ అనుకరించలేకపోయారు .. అనుకరించలేకపోయారు. 'కనకతార' .. 'గృహలక్ష్మి' .. 'పల్నాటి యుద్ధం' .. 'పాదుకా పట్టాభిషేకం' .. 'తోడికోడళ్లు' సినిమాలు ఆమె కెరియర్లో మైలురాళ్లుగా కనిపిస్తాయి. ఇక నాటకాల సమయం నుంచే ఆమె మంచి గాయని కావడం వలన, కొన్ని సినిమాలలో తన పాత్రకి తానే పాడుకున్నారు.

తెలుగు .. తమిళ భాషల్లో ఆనాటి కథానాయకులతో కలిసి నటించిన ఆమె, దర్శక నిర్మాత అయినటువంటి 'కడారు నాగభూషణం'ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత శ్రీరాజరాజేశ్వరీ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి, భర్తతో కలిసి తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో 22 సినిమాలను నిర్మించారు. ఆ సినిమాల్లో చాలావరకూ విజయాలను సాధించినవే కావడం విశేషం. అప్పట్లో ఆమె ఆఫీసు ఆర్టిస్టులతో .. సాంకేతిక నిపుణులతో ఎప్పుడు చూసినా చాలా సందడిగా కనిపిస్తూ ఉండేదట.

ఆమె సినిమాలకు పనిచేసినవారిలో ఎవరూ కూడా 1వ తేదీ తరువాత డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవట. అంత కరెక్టుగా ఆమె చెల్లింపులు చేసేవారిని అంటారు. ఈ కారణంగానే ఆమె సంస్థలో పనిచేయడానికి అందరూ ఉత్సాహాన్ని చూపుతుండేవారట. అప్పట్లో ఆమె అభినయాన్ని గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటే, ఆమె మంచితనం .. ఉదార స్వభావం గురించి ఇండస్ట్రీలో చెప్పుకునేవారని అంటారు. చెన్నై వీధుల్లో పరిగెత్తే ఆమె పడవలాంటి కారును చూడటానికి అప్పట్లో చాలామంది ఎంతో ఓపికతో నిరీక్షించేవారట.

అలాంటి కన్నాంబను .. కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు మానసికంగా కుంగదీశాయని అంటారు. ఉక్కులాంటి ఆమె మనోధైర్యంపై ఆ ప్రభావం బాగా పడిందని చెబుతారు. దాంతో ఆమె అనారోగ్యం బారినపడటం .. ఆ తరువాత ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయింది. కడారు నాగభూషణం మంచి దర్శక నిర్మాతే అయినా, ఇంటివ్యవహారాలు .. వ్యాపార లావాదేవీలు ఆమెనే చక్కబెట్టేవారు. ఆమె చనిపోవడంతో ఆయనకి అంతా శూన్యంగా అనిపించింది.

కన్నాంబ లేని ఆస్తిపాస్తుల విషయంలో ఆయన ఉదాసీనంగా వ్యవహరించారు. దాంతో ఆయన ఇంటితో సహా అన్నీ కోల్పోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. విశాలమైన మేడల్లో నుంచి .. ఖరీదైన కారుల్లో నుంచి ఈ ప్రపంచాన్ని చూసిన ఆయన, చివరి రోజుల్లో ఇరుకైన అద్దె ఇంట్లో సర్దుకున్నారు. అలా ఎంతో అన్యోన్యమైన .. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆ దంపతుల చివరిరోజులు కన్నీటితో తడిసిపోవడం .. విషాదంతో ముగిసిపోవడం బాధాకరం.