Begin typing your search above and press return to search.

ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలిన యువనటి

By:  Tupaki Desk   |   27 May 2020 10:00 PM IST
ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలిన యువనటి
X
కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటి మెబీనా(22) మరణించారు. అతి పిన్న వయసులో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. తన స్వస్థలం మెడికెరికి వెళ్తుండగా దేవీహళ్లి వద్ద ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకురావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మెబీనాను సమీప ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మరణించినట్లు స్థానికులు తెలిపారు. నటి మెబీనా కన్నడలో పలు టివి సీరియల్స్ తో నటిస్తోంది. ఆమె మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటన వైపు వచ్చింది. రంగుల ప్రపంచంలో ఎదగాలని భావించిన మెబీనా కలలు చిన్నాభిన్నమయ్యాయి. మెబీనా బెంగుళూరు నుంచి కారులో తన స్నేహితులతో హోమ్ టౌన్ మడికేరికి బయలుదేరింది.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన తర్వాత మెబీనా... ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మెబీనా ఇలా ప్రాణాలు విడిచింది. అయితే మెబీనా మరణవార్తతో ఆమె స్నేహితులు, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో పీహెచ్‌హెచ్‌ఎల్‌ 4 హోస్ట్‌ అకుల్‌ బాలాజీ ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘నా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. మెబీనా చిన్న పిల్ల. తను చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’అంటూ మెబీనాకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితులు గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మెబీనా స్నేహితులు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.