Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడి కోసం కన్నడ మ్యూజిక్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   12 Oct 2022 9:31 AM GMT
మెగా మేనల్లుడి కోసం కన్నడ మ్యూజిక్ డైరెక్టర్..!
X
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదే సెట్స్ మీదకు వచ్చిన ఈ సినిమా తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకోవడంతో ఆలస్యమైంది. అయితే ఇప్పుడు మళ్లీ ఎప్పటిలాగే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

తాత్కాలికంగా SDT15 పేరుతో పిలవబడుతున్న ఈ ఆసక్తికరమైన మిస్టిక్ థ్రిల్లర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ తో వచ్చారు మేకర్స్. ఈ సినిమా సంగీత దర్శకుడిని అధికారికంగా ప్రకటించారు.

అనేక కన్నడ బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే ప్రతి ఎమోషన్, థ్రిల్ ని కలిగించడంలో అతను మాస్టర్ అని ఇటీవలి బ్లాక్ బస్టర్ చిత్రాలు 'విక్రాంత్ రోనా' మరియు 'కాంతారా' నిరూపించాయి.

ఇప్పుడు తెలుగులో SDT15 సినిమా కోసం అజనీష్ లోక్ నాథ్ పని చేస్తుండటంతో.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అజనీష్ గతంలో 'కిరాక్ పార్టీ' 'రాజరథం' 'నన్ను దోచుకుందువటే' వంటి చిత్రాలకు సంగీతం సమకూర్చారు.

SDT15 అనేది సాయి తేజ్ కి ఫస్ట్ మిస్టిక్ థ్రిల్లర్ కావడంతో అతను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందననే టాక్ కూడా వినిపిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నిర్మాణంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భాగస్వామిగా ఉండటమే కాకుండా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్దత్ సైనుద్దీన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.