Begin typing your search above and press return to search.

న‌టుడి భార్య‌కు హీరో ఫ్యాన్స్ వేధింపులు!

By:  Tupaki Desk   |   25 Oct 2019 12:15 PM GMT
న‌టుడి భార్య‌కు హీరో ఫ్యాన్స్ వేధింపులు!
X
అభిమానం హ‌ద్దు మీరితే ఎలా ఉంటుందో ఇదిగో ఈ సంఘ‌ట‌న ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. పిచ్చి అభిమానులు చేసిన ఆ సిగ్గు మాలిన ప‌నికి క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ సారీ చెప్పాల్సి వ‌స్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగింది అని ఆరా తీస్తే ...

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ కి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ స్టార్ గా అత‌డికి ఓవ‌ర్ నైట్ అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. దాంతో పాటే సోష‌ల్ మీడియాల్లో అభిమాన సంఘాలు విచ్చ‌ల‌విడిగా పెరిగాయి. ఇక ఈ ఫ్యాన్స్ వీరంగం కూడా మామూలుగా లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తూ చాలానే హ‌డావుడి చేస్తున్నారు. డై-హార్డ్ ఫ్యాన్స్ పేరుతో ట్రోలింగ్ చేస్తూ అర్ధంప‌ర్థంలేని కామెంట్లు చేస్తున్నారు.

కన్నడ నటి సంగీత భట్ పై దుర్భాష‌లాడుతూ అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో య‌శ్ అభిమానులు లైంగిక వేధింపులకు పాల్ప‌డ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు కార‌ణం రెండేళ్ల నాడు సంగీత భ‌ర్త సుధర్శ‌న్ రంగప్రసాద్ చేసిన ఓ మిమిక్రీ వీడియోనే. అత‌డు క‌న్న‌డ రంగంలో స్టాండ్-అప్ కమెడియన్. రెండేళ్ల‌ క్రితం యష్ సంభాషణను అనుకరిస్తూ ఒక వీడియో చేశాడు. ఆ పాత వీడియోను తవ్వి సంగీత భట్ కు సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయ‌డ‌మే గాక‌.. అవమానకరంగా మాట్లాడుతూ .. లైంగిక వేధింపుల సందేశాలను పోస్ట్ చేశారు. ఆమె భ‌ర్త యష్‌తో కలిసి పనిచేశాడని.. అత‌డు చేసిన ప‌నికి సంగీత క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ట్రోలింగ్ క‌ల్చ‌ర్ విచ్చ‌ల‌విడిత‌నానికి ఇది ఎగ్జాంపుల్ గా నిలిచింది. హీరోపై అభిమానం ఉన్నంత మాత్రాన ఎప్పుడో పాత వీడియో ప‌ట్టుకుని ఇలా వేధింపుల‌కు పాల్ప‌డ‌డ‌మేమిటో. దీనికి య‌శ్ త‌ల దించుకోవాల్సి వ‌స్తోంది. ఓవైపు కేజీఎఫ్ సీక్వెల్ తో అత‌డు బిజీగా ఉంటే ఫ్యాన్స్ లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చి పెడుతున్నారు.