Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ సిస్టర్ కొత్త బిజినెస్

By:  Tupaki Desk   |   8 April 2019 4:50 PM GMT
స్టార్ హీరోయిన్ సిస్టర్ కొత్త బిజినెస్
X
క్వీన్ కంగన రనౌత్ .. గత కొంతకాలంగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సర్కిల్స్ లోనూ మార్మోగుతున్న పేరు ఇది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పై పదే పదే నోరు పారేసుకుంటూ కంగన చేసిన కామెంట్ల గురించి తెలుగు మీడియాలో ఆసక్తికర కథనాలొచ్చాయి. ``మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`` సక్సెస్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుని క్రిష్ చేసిందేం లేదని మీడియా ముంగిట వ్యంగ్యాస్త్రాలు సంధించింది కంగన. పురుషాధిక్య ప్రపంచంపై నిరంతరం చిందులు తొక్కే క్వీన్ ఇదివరకూ రైటర్ అపూర్వ అస్రాణీ పైనా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ పైనా ఓ రేంజులో వార్ నడిపించింది.

రెండేళ్ల క్రితం హృతిక్ పై కోర్టు లో న్యాయ పోరాటం చేసింది. ఆ సమయంలో తనపై తిరగబడిన వారందరిపైనా క్వీన్ వాక్ (వాక్కు) యుద్ధం చేసింది. ఆ సమయంలో కంగనకు తన సోదరి రంగోలి బాసటగా నిలిచి తిట్ల దండకం అందుకున్న సంగతి తెలిసిందే. కంగన తరపున తన గొంతు బలంగా వినిపించిన రంగోలి హృతిక్ పైనా, రాకేష్ రోషన్ పైనా ఓ రేంజులో విరుచుకుపడింది. తన సోదరి న్యాయపోరాటానికి పూర్తి మద్ధతునిచ్చింది. అందుకే ఈ అక్క చెల్లెళ్లు ఇద్దరినీ ఇప్పటికీ జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు. కంగనతో పాటు రంగోలి పేరుకు ఎంతో ప్రాచుర్యం వచ్చింది ఆ గొడవ వల్ల.

తాజా సమాచారం ప్రకారం .. ఈ అక్కా చెల్లెళ్లు కేవలం గొడవల్లోనే కాదు.. వ్యాపారంలోనూ పెట్టుబడులు షేర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. రంగోలి చేసే ప్రతి బిజినెస్ లో కంగన భాగస్వామి. సినిమాల్లో సంపాదించినది సిస్టర్ వ్యాపారంలో పెడుతోంది కంగన. హిమాలయాల్లోనూ అక్కా చెల్లెళ్ల బిజినెస్ వేడెక్కిస్తోంది. హిల్ స్టేషన్ అయిన మనాలి లో రంగోలి అదిరిపోయే హోటల్ కం లాడ్జింగ్ ని నిర్మించిందిట. ఫ్యాన్సీ రేట్లు పెట్టి ఆన్ లైన్ లోనే ఇక పర్యాటకుల్ని ఆకర్షించి భారీగా ఆర్జించబోతున్నారని తెలుస్తోంది. రంగోలి తన భర్త అజయ్ ఇద్దరూ కలిసి `పష్మిన బొటిక్ హోటల్` ని ప్రారంభించారు. హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు అంటే భారీగా ఆదాయ ఆర్జనకు ఆస్కారం ఉంటుందనడంలో సందేహం లేదు. పైగా హిల్ స్టేషన్ లో పర్యాటక రంగం నుంచి దండుకునే వీలుంటుంది. స్వతహాగానే హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి వలస వచ్చిన కుటుంబం కంగనది. అందువల్ల హోటల్ బిజినెస్ వైపు అడుగులు వేయడం పెద్దంతగా ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అదన్నమాట.