Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ అంటే అంత‌ అలుసా క్వీన్?

By:  Tupaki Desk   |   16 Dec 2019 1:05 PM IST
ఫ్యాన్స్ అంటే అంత‌ అలుసా క్వీన్?
X
అభిమాన తార‌ల కోసం అభిమానులు దూరతీరాల నుంచి ఎంతో ఆశ‌గా వ‌స్తారు. స్టూడియోలు.. షూటింగ్ స్పాట్స్ చుట్టూ తిరిగేస్తూ ఒక్క సెల్ఫీ ప్లీజ్! అంటూ వెంట‌ప‌డుతుంటారు. ఒక్క‌సారైనా ఫేవ‌రెట్ హీరో.. హీరోయిన్ ని చూడ‌క‌పోతామా?.. క‌నీసం ఒక్క ఫోటో అయినా కుద‌ర‌క‌పోతుందా? అంటూ చ‌క్క‌ర్లు కొడుతుంటారు. ముఖ్యంగా తెలుగు- త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఈ క‌ల్చ‌ర్ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అందుకే కొంద‌రు హీరోలు షూటింగ్ స్పాట్ లో ఫోటో సెష‌న్ కు స‌మ‌యం కేటాయిస్తుంటారు. ఇంకొంద‌రు వేర్వేరు వేదిక‌ల‌పై అభిమానుల‌కు టైమ్ ఇస్తుంటారు. సూపర్ స్టార్ మ‌హేష్ అయితే షూటింగ్ స్పాట్ లో అభిమానుల కోసం కొంత స‌మ‌యం కేటాయిస్తుంటారు. ఫిలింన‌గ‌ర్ ఇంటి ద‌గ్గ‌ర ఫోటో సెష‌న్స్ కి టైమ్ ఇస్తుంటారు.

ఇంకా రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్... ప్ర‌భాస్.. బ‌న్నీ వీళ్లంతా ఫ్యాన్స్ ఫ్రెండ్లీనే. ఈ త‌రం హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంతా అభిమానులను ఎప్పుడూ అశ్ర‌ద్ధ‌ చేయ‌రు. ఇటీవ‌ల మ‌న హీరోలు అభిమానుల పెళ్లికి హాజ‌ర‌వుతూ స‌ర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ విష‌యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి దిగ్గ‌జాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కోలీవుడ్ హీరోలు.. అభిమానుల ఇంట పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డం చూస్తున్న‌దే. బాలీవుడ్ లో సైతం అమితాబ్ బ‌చ్చ‌న్- స‌ల్మాన్ ఖాన్- షారుక్ ఖాన్ లాంటి వాళ్లు అభిమానుల కోసం కొంత స‌మ‌యం కేటాయిస్తుంటారు. ఇక సౌత్ లో ఫేమ‌స్ అయిన హీరోయిన్లు కూడా అభిమానుల మాట‌ను కాద‌న‌లేరు.

మ‌రి ఇవ‌న్నీ బాలీవుడ్ న‌టి కంగ‌న‌కు తెలుసో తెలియ‌క‌నో గానీ! అభిమానుల దృష్టిలో మాత్రం ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవిలో కంగ‌న న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. హైద‌రాబాద్ లోని ఓ స్టూడియోలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అది తెలిసిన కొంత మంది అభిమానులు స్పాట్ కు చేరుకున్నారట‌. ఫ్యాన్స్ య‌థావిధిగానే సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారుట‌. దీంతో కంగ‌న చిరాకు ప‌డిపోయింద‌ట‌. అంతేకాదు.. అక్క‌డ బ్లాంకెట్‌ అడ్డు పెట్టుకుని త‌ప్పించుకుని వెళ్లిపోయిందిట‌. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడు ఎదురుకాలేద‌ని.. ఇదేం అభిమానం రా దేవుడా? అంటూ అస‌హ‌నానికి గురైంద‌ట‌. దీంతో అభిమానులు కూడా కంగ‌న యాటిట్యూడ్ పై సీరియ‌స్ అయ్యారుట‌. ఏ విష‌యంలోనైనా ముక్కు సూటిగా ఉండే కంగ‌న‌కు అభిమానులంటే అంత చుల‌క‌నా? నీతులు- సూక్తులు వ‌ల్లించ‌డంలో ముందుండే ఈ భామ‌కు అభిమానం చేదా? అంటూ అస‌హ‌నానికి గుర‌య్యారట‌. అయినా ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు అభిమానుల్ని కూల్ చేసేయొచ్చు.. అదీ ఇంత త‌ప్పు జ‌రిగాక‌ కూడా! అదీ అభిమాని మ‌న‌సు అని ఆవిడ అర్థం చేసుకునేదెలా?