Begin typing your search above and press return to search.

అర్నబ్ అరెస్ట్ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫైర్ బ్రాండ్..!

By:  Tupaki Desk   |   4 Nov 2020 4:00 PM IST
అర్నబ్ అరెస్ట్ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఫైర్ బ్రాండ్..!
X
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి ని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ ని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణపై అర్నబ్ పై సెక్షన్ 306 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసి రాయఘడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్నబ్ గోస్వామి అరెస్ట్‌ పై బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా 'మహారాష్ట్ర ప్రభుత్వానికి సందేశం' #ArnabWeAreWithYou అంటూ ఓ వీడియో షేర్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది కంగన.

కంగనా మాట్లాడుతూ ''అర్నబ్ గోస్వామి ఇంటిలోకి దూసుకెళ్లి ఆయనపై దాడి చేసి.. జుట్టు పట్టుకొని లాగడంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగాలని అనుకొంటున్నాను. మీరు ఎన్ని ఇళ్లపై దాడుల చేస్తారు? ఇంకా ఎన్ని గొంతులు నొక్కుతారు? ఎంతమందిని వేధిస్తారు? ఎంత మంది నోళ్లు మూయిస్తారు? సోనియా సేన ఎన్నాళ్లు ఇలాంటి దారుణాలు చేస్తారు?. అన్యాయాలు, అక్రమాలపై సోనియా సేన నోరు మూయించాలని ప్రయత్నిస్తే మరిన్ని గొంతులు పైకి లేస్తాయి. ఇంతకు ముందు ఎంతో మంది దేశభక్తులు గొంతులు కోసారు. ఎంతో మందికి ఉరితాళ్లు బిగించారు. అయినా మేము వెనుకడుగు వేయం. ఒక గొంతు నొక్కితే చూస్తే ఎన్నో గొంతులు లేస్తాయి'' అంటూ ఫైర్ అయింది. అలానే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే‌ మరియు ఆయన కుమారుడిపై కూడా కంగన విమర్శలు చేసింది. 'పెంగ్విన్‌ లా వ్యవహరిస్తే పెంగ్విన్ అనకుంటే ఏమనాలి? నీ తండ్రి పప్పు లాంటి పాలన చేస్తే పప్పుసేన అని అంటాం. సోనియా సేన అంటే కోపం వస్తుందా? మరోసారి మీరు సోనియా సేనకి చెందిన వారే అని అంటాను' అని కంగన రనౌత్ చెప్పుకొచ్చింది.

కాగా, ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆమె తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 'తనకు రావాల్సిన రూ.5.40 కోట్ల రూపాయాలను సకాలంలో అర్నబ్ గోస్వామి - ఫీరోజ్ షేక్ - నితీస్ సర్దా చెల్లించలేకపోవడం వల్ల ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాం. ఆ కారణంగానే తాము సూసైడ్ చేసుకొంటున్నామ'ని అనయ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. దాని ఆధారంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ ముఖ్ అసెంబ్లీలో మాట్లాడుతూ 'అన్వయ్ నాయిక్ భార్య, కూతురు అర్నబ్ గోస్వామిపై తనకు ఫిర్యాదు చేశారని.. వారి ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు జరుగుతుంద'ని చెప్పారు. ఈ క్రమంలో అర్నబ్ గోస్వామి ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.