Begin typing your search above and press return to search.

ఈసారి ఇందిర‌మ్మగా.. అమ్మ పాత్ర‌ల‌న్నీ కంగ‌న‌కేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2021 11:00 AM IST
ఈసారి ఇందిర‌మ్మగా.. అమ్మ పాత్ర‌ల‌న్నీ కంగ‌న‌కేనా?
X
అమ్మ పాత్ర‌ల‌న్నీ క్వీన్ కంగ‌న కొట్టేస్తోంది. ప్ర‌స్తుతం అమ్మ జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తోంది. ఆ వెంట‌నే ఇందిరమ్మ పాత్ర‌లో న‌టించే అరుదైన అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది కంగ‌న‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఓవైపు రియల్ లైఫ్ లో రాజ‌కీయ నాయ‌కుల‌తో వివాదాల‌కు దిగుతూనే మ‌రోవైపు వ‌రుస సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ విష‌యంలోనూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇక త‌న వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల్ని నిరంత‌రం సోషల్ మీడియాల్లో వెల్ల‌డిస్తూనే ఉంటుంది. రాజకీయ సామాజిక సమస్యల నేప‌థ్యంలోనే తన సినిమాలు ఉంటాయ‌ని కూడా పున‌రుద్ఘాటించింది.

తలైవి షూటింగ్ పూర్తయిన తరువాత కంగన మ‌రో రాజకీయ నేపథ్యం ఉన్న క‌థాంశంలోనే న‌టించ‌నుంది. త‌దుప‌రి పొలిటిక‌ల్ డ్రామాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించ‌నుంది. దీని గురించి మాట్లాడుతూ, .. త‌దుప‌రి చిత్రంలో అత్యంత ఐకానిక్ లీడర్ అయిన ఇందిర‌మ్మ‌గా నటించడం చాలా ఆనందాన్నిస్తుంద‌ని కంగన ఇన్ స్టాలో వెల్ల‌డించారు.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం బయోపిక్ కాదని.. ఇందులో చాలా మంది ప్రముఖ నటులు భాగం అవుతారని వెల్లడించింది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉంది. ఇది ఇందిరా గాంధీ బయోపిక్ కాదు. పీరియ‌డ్ హిస్టారిక‌ల్ సినిమా. నికార్స‌యిన‌ రాజకీయ డ్రామాతో నేటి తరం ప్ర‌తిదీ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత భారతదేశం సామాజిక-రాజకీయ ప్రకృతి దృశ్యం తెర‌పైకి తెస్తున్నాం`` అని కంగన కార్యాలయ వ‌ర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ చిత్రం ఒక పుస్తకం ఆధారంగా రూపొందిస్తున్నార‌ని కంగ‌న వెల్ల‌డించింది. ఇందిర‌మ్మ‌ ఎమర్జెన్సీ విధించిన నాటి అనుభ‌వాలు.. ఆపరేషన్ బ్లూ స్టార్ త‌దిత‌ర విష‌యాల్ని ఇందులో చూపిస్తార‌ట‌. దివంగత మాజీ PM ఇందిరాగాంధీకి నా ప్రశంసలు అంటూ తన ఫోటోలను పంచుకుంది కంగ‌న‌. భారత రాజకీయ చరిత్రలో మనకు లభించిన అత్యంత దిగ్గజ నాయకురాలి పాత్ర‌లో నటించాలని నేను ఎదురు చూస్తున్నాను అని ఎగ్జ‌యిట్ అయ్యారు కంగ‌న‌.

ఇంతకుముందు కంగన `రివాల్వర్ రాణి`కి ప‌ని చేసిన‌ దర్శకుడు సాయి కబీర్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయ‌నే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. పీరియడ్ డ్రామా చాలా పెద్ద ఎత్తున భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తారు. సంజయ్ గాంధీ - రాజీవ్ గాంధీ - మొరార్జీ దేశాయ్ - లాల్ బహదూర్ శాస్త్రి వంటి ఇతర ప్రముఖ పాత్రధారుల్ని ఎంపిక చేయ‌నున్నారు. ఇప్పటికే కంగ‌న‌తో ద‌ర్శ‌కుడు కొన్ని సిట్టింగ్ ‌లు పూర్తి చేశారు. స్క్రీన్ ప్లే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ధాక‌డ్ కాకుండా కంగనా రనౌత్ న‌టించాల్సిన‌ తేజస్ చిత్రం ప్రీప్రొడ‌క్ష‌న్ సాగుతోంది. తేజస్ లో ఒక వైమానిక దళ పైలట్ పాత్ర పోషించ‌నుంది.