Begin typing your search above and press return to search.

మనోడికి కంగనా సిస్టర్‌ సపోర్ట్‌

By:  Tupaki Desk   |   9 July 2019 11:15 AM IST
మనోడికి కంగనా సిస్టర్‌ సపోర్ట్‌
X
అర్జున్‌ రెడ్డి చిత్రం విడుదల సమయంలో ఇక్కడ ఏవిధంగా అయితే వివాదాస్పదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోస్టర్లను తగులబెట్టడం.. యూనిట్‌ సభ్యులపై విమర్శలు చేయడం నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు అర్జున్‌ రెడ్డి హిందీలో కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ అయ్యి వారి ముందుకు వెళ్లింది. అక్కడ అంతకు మించిన వివాదం చెలరేగుతోంది. సినిమా విడుదలైనప్పటి నుండి కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ వివాదం తాజాగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది.

ప్రేమికులన్నాక ముద్దు పెట్టుకోవడం.. కొట్టుకోవడం అనేది చాలా కామన్‌. అలా ఉంటేనే ప్రేమ దృడంగా ఉంటుందని సందీప్‌ చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఖండిస్తున్నారు. కొట్టుకుంటే ప్రేమ ఉన్నట్లు ఏంటంటూ బాలీవుడ్‌ వారితో పాటు సమంత మరియు చిన్మయి వంటి వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సిస్టర్‌ రంగోలి తనదైన శైలిలో స్పందించింది.

ఒక పాత సినిమాలోని రాజ్‌ కపూర్‌ లవ్‌ సీన్‌ బిట్‌ ను పోస్ట్‌ చేసి అంతా లెజెండ్‌ అని భావించే రాజ్‌ కపూర్‌ అప్పట్లోనే మోటు సరసం చేశాడు. మోటు సరసంకు అసలు సిసలు ఉదాహరణ ఇది. రాజ్‌ కపూర్‌ ను బాలీవుడ్‌ లెజెండ్‌ అంటూ భావించే మీరు ఒక దక్షిణాది దర్శకుడిని ఇలా విమర్శించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించింది. సందీప్‌ రెడ్డి వంగకు రంగోలి మద్దతు తెలపడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

బాలీవుడ్‌ స్టార్స్‌ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈమద్య కాలంలో ఎక్కువగా మీడియాలో ఉంటున్న రంగోలి 'కబీర్‌ సింగ్‌' వివాదంపై స్పందించడంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశం అయ్యింది. ఒక వైపు వివాదం పెద్దదవుతుంటే మరో వైపు 'కబీర్‌ సింగ్‌' కలెక్షన్స్‌ దూసుకు పోతున్నాయి. 200 కోట్ల వరకు వస్తాయనుకుంటే ఇప్పుడు 250 కోట్లకు పైగా రావడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

For Video Click Here