Begin typing your search above and press return to search.

జాతీయ భాష డిబేట్ లో వేలు పెట్టిన కంగ‌న‌

By:  Tupaki Desk   |   1 May 2022 4:30 AM GMT
జాతీయ భాష డిబేట్ లో వేలు పెట్టిన కంగ‌న‌
X
కంగనా రనౌత్ న‌టించిన `ధాకడ్` ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. విలేకరుల సమావేశంలో కంగనను ధాక‌డ్ పైనా వినోద పరిశ్రమకు సంబంధించి కొన్ని వ్య‌వ‌హారాల‌పైనా ప్రశ్నలు అడిగారు.

జాతీయ భాష కాకపోతే దక్షిణాది భాషా చిత్రాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? అని అజయ్ దేవగన్ ఇంత‌కుముందు కిచ్చా సుదీప్ ని ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పెద్ద డిబేట్ కి దారితీసిన క్ర‌మంలో చర్చ గురించి కూడా కంగ‌న‌ చిద్విలాసంగా స్పందించింది.

ఈ వివాదంపై కంగనా రనౌత్ త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వ‌లేదు. మనది చాలా వైవిధ్యంతో బహుళ భాషలు సంస్కృతులు కలిగిన దేశం. ప్రతి ఒక్కరికీ వారి వారి భాష వారి సంస్కృతిపై గర్వించే హక్కు ఉంది. నేను పహాడీని.. నేను గర్విస్తున్నాను అని కంగనా చెప్పింది.

ఏ భాష జాతీయ భాషగా ఉండాలని మీరు నన్ను అడిగితే అది సంస్కృతం కావాలని నేను అనుకుంటున్నాను. కన్నడ- తమిళం- గుజరాతీ లేదా హిందీ కంటే సంస్కృతం పాతది.

ఈ భాషలన్నీ సంస్కృతం నుండి వచ్చాయి. అలాంటప్పుడు సంస్కృతం జాతీయ భాషగా ఎందుకు మారలేదు? దీనికి నా దగ్గర సమాధానం లేదు. ఆ సమయంలో (రాజ్యాంగం రచించినప్పుడు) తీసుకున్న నిర్ణయాలే దీనికి కార‌ణం అని ఆమె అన్నారు.

సంస్కృతం కాకుండా హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారనే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాక దానిని పాటించకపోతే మీరు రాజ్యాంగాన్ని తిరస్కరించిన‌ట్టే.

హిందీ మన జాతీయ భాష కాబట్టి అజయ్ సార్ ఏది చెప్పినా కరెక్ట్. కానీ సుదీప్ సెంటిమెంట్ నాకు అర్థమైంది. అతను కూడా తప్పు కాదు అని వివాదంపై మాట్లాడింది. ధాకడ్ 20 మే 2022న థియేటర్లలో విడుదలవుతోంది. గ్రిప్పింగ్ యాక్ష‌న్ తో ధాక‌డ్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.