Begin typing your search above and press return to search.

'జల్లికట్టు' టీమ్ ని అభినందిస్తూనే బాలీవుడ్ పెద్దల పై సెటైర్లు..!

By:  Tupaki Desk   |   26 Nov 2020 12:30 PM GMT
జల్లికట్టు టీమ్ ని అభినందిస్తూనే బాలీవుడ్ పెద్దల పై సెటైర్లు..!
X
93వ ఆస్కార్‌ అవార్డుల రేసులో మలయాళ మూవీ 'జల్లికట్టు' కు స్థానం కల్పిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మొత్తం 27 సినిమాలతో పోటీ పడి ఈ చిత్రం ఎంట్రీని దక్కించుకుంది. 'జల్లికట్టు'తో పాటు 'శకుంతలాదేవి' 'గుంజన్‌ సక్సేనా' 'ఛపాక్‌' 'గులాబో సితాబో' 'చెక్‌ పోస్ట్‌' 'స్కై ఈజ్‌ పింక్‌' వంటి సినిమాలను పరిశీలించిన జ్యూరీ చివరకు 'జల్లికట్టు'ను ఇండియా తరపున ఆస్కార్‌ పురస్కారాలకు పంపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మనుషులలో అంతర్లీనంగా ఉండే క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మనుషులు ప్రవర్తించే విధానాన్ని ప్రశ్నించే విధంగా సినిమా ఉందని జ్యూరీ ఛైర్మన్‌ పేర్కొన్నారు. 'జల్లికట్టు' ఆస్కార్ రేసులో నిలవడంపై సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ సైతం చిత్ర బృందానికి అభినందిస్తూ ట్వీట్ చేసింది.

అయితే ఈ సందర్భాన్ని కూడా కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ కు చెందిన పెద్దలపై సెటైర్లు వేయడానికి ఉపయోగించుకుంది. జల్లికట్టు చిత్ర బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేస్తూనే బాలీవుడ్‌ ప్రముఖులను విమర్శించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరిపై పెత్తనం చేయాలని చూసే బుల్లీ దావుద్‌ గ్యాంగ్‌ కు సరైన ఫలితాలే వచ్చాయని.. భారతీయ చిత్ర పరిశ్రమ అనేది కేవలం నాలుగు కుటుంబాలది మాత్రమే కాదంటూ ట్వీట్ చేసింది. కంగనా యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత బాలీవుడ్ పైన మరియు మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వంపైనా అనేక ఆరోపణలు చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది. ఈ క్రమంలో కంగనా మీద అనేక కేసులు నమోదు చేయబడ్డాయి.