Begin typing your search above and press return to search.

వెనక్కు తగ్గిన స్టార్‌ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   28 Jun 2019 6:53 AM GMT
వెనక్కు తగ్గిన స్టార్‌ హీరోయిన్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తాజా చిత్ర వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. మైంటల్‌ హై క్యా అనే టైటిల్‌ తో కంగనా చేసిన ఈ చిత్రం టైటిల్‌ వివాదం ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. టైటిల్‌ విషయంలో అస్సలు వెనక్కు తగ్గనంటూ మొదటి నుండి చెబుతూ వచ్చిన కంగనా రనౌత్‌ ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో టైటిల్‌ ను మార్చేందుకు ఒప్పుకుందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మెంటల్‌ అనే పదంపై ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ వారు మొదటి నుండి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కావాల్సి ఉండగా సదరు సొసైటీ వారు అడ్డుకోవడంతో వాయిదా వేయడం జరిగింది. వారి ఒత్తిడి మేరకు టైటిల్‌ ను మార్చాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చారు. మొన్నటి వరకు టైటిల్‌ మార్పుకు నో చెప్పిన కంగనా రనౌత్‌ తాజాగా ఒత్తిడికి వెనక్కు తగ్గి ఓకే చెప్పిందని తెలుస్తోంది. మణికర్ణిక చిత్రం తర్వాత కంగనా చేసిన చిత్రం ఇదే అనే విషయం తెల్సిందే.

మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు అయిన ప్రకాష్‌ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి నిరాశ పర్చిన ప్రకాష్‌ కోవెలమూడి హిందీలో మొదటి సినిమాతోనే సక్సెస్‌ అందుకునేలా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు సినిమాకు సంబంధించిన విశేషాలతో ఈ చిత్రం సక్సెస్‌ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంకు వచ్చిన టైటిల్‌ వివాదంతో కూడా మంచి పబ్లిసిటీ దక్కింది. దాంతో 'మెంటల్‌ హై క్యా' తో బాలీవుడ్‌ లో ప్రకాష్‌ కోవెలమూడి జెండా పాతే అవకాశం కనిపిస్తుంది.

జులై 26న ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంపై కంగనా అండ్‌ టీం చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో కంగనాతో పాటు రాజ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించాడు. ఏక్తా కపూర్‌ నిర్మించిన ఈ చిత్రంతో కంగనా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.