Begin typing your search above and press return to search.

ఒకేసారి ఇద్దరు బడా హీరోల్ని బుక్ చేసిన ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   19 May 2022 11:30 PM GMT
ఒకేసారి ఇద్దరు బడా హీరోల్ని బుక్ చేసిన ఫైర్ బ్రాండ్
X
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. రీల్ లో ధరించే పాత్రలకు.. రియల్ లైఫ్ లో ఫాలో కావటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రౌనత్ రూటు సపరేటు. బాలీవుడ్ దిగ్గజ హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ ఆమె సొంతం. అప్పుడెప్పుడో హృతిక్ రోషన్ తో మొదలెట్టి.. వాళ్లు వీళ్లు లేకుండా తనకు నచ్చని వారెవరైనా సైతం ముఖం పగిలేలా వ్యాఖ్యలు చేయటం ఆమెకు సొంతం. చివరకు కేంద్ర మంత్రి స్థాయి నేత ఆమె ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె వ్యవహరించిన తీరు.. మీడియాలో దానికి సంబంధించిన ఫోటోలు చూసినోళ్లు నోరెళ్లబెట్టిన పరిస్థితి. అలాంటివెన్నో కంగనా సొంతం.

మొన్నటికి మొన్న రంజాన్ సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చిన విందునకు పలువురు ప్రముఖులు హాజరు కాగా.. వారిలో కంగనా ఒకరు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. క్వీన్ ఎంట్రీ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎందుకు పాల్గొన్నారు? అంటూ కొందరు ప్రశ్నించిన పరిస్థితి. ఇలాంటివేళ.. కంగనా ఇచ్చిన ఆన్సర్.. కండల వీరుకు ఇబ్బంది కలిగేలా ఉండటం విశేషం. పనిలో పనిగా తనకు కోపం ఉన్న బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్టు అమీర్ ఖాన్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఒకేసారి ఇద్దరు ఖాన్ల మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

బాలీవుడ్ లో దిగ్గజ హీరోలుగా చెప్పే అగ్ర నటుల విషయంలో కించిత్ మొహమాటం లేనట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇలాంటివి కంగనాకు మాత్రమే సాధ్యమన్నట్లుగా ఉన్నాయని చెప్పాలి. రంజాన్ సందర్భంగా ఇచ్చిన విందుకు తాను ఎందుకు హాజరయ్యానన్న ప్రశ్నకు బదులిస్తూ.. బాలీవుడ్ ప్రముఖులు ఇచ్చే పార్టీలకు వెళ్లకూడదని తాను అనుకోలేదన్నారు.

తన వ్యక్తిగత నిర్ణయంతోనే తాను సల్మాన్ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకల్లో హాజరైనట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె వివరణ ఇచ్చినట్లుగా ఇస్తూ.. ‘నిజానికి సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. పార్టీకి రమ్మని ఫోన్ చేసి ఆహ్వానించారు. అందుకే వెళ్లా. అది కాక.. నేను నటించిన సినిమాను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేశారు’’ అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.

పిలవని పేరంటానికి తానేమీ వెళ్లలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తూ.. సల్మాన్ అంతటోడు స్వయంగా ఫోన్ చేశారు కాబట్టే వెళ్లానన్న విషయాన్ని చెబుతూ.. పనిలో పనిగా తాను టార్గెట్ చేసిన అమీర్ ఖాన్ మీద ఆరోపణ బాంబును వేసింది. కొంతమంది తారలు తమ సినిమాల్ని మనతో ప్రమోట్ చేసుకుంటారు కానీ.. వారు మాత్రం ప్రమోట్ చేయరంటూ అమీర్ మీద నిప్పులు చెలరేగింది. ‘మణికర్ణిక రిలీజ్ వేళలో నేను అమీర్ కు ఫోన్ చేశారు.

ఆయన నటించిన దంగల్.. పీకే ట్రైలర్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశానని చెప్పా. మీ చిత్రాల్ని ప్రమోట్ చేయమని అడిగారు కదా. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కు రెఢీ అయ్యింది. కొంచెం మీరూ సాయం చేయమని అడిగా. కానీ..ఆయన నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు’ అంటూ కంగన తనను ఫైర్ బ్రాండ్ ఎందుకంటారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. తాజా ఎపిసోడ్ ను చూస్తే.. సల్మాన్.. అమీర్ ఇద్దరిని భలేగా బుక్ చేసిన వైనం కొట్టొచ్చినట్లుగా ఉందని చెప్పాలి.