Begin typing your search above and press return to search.

కంగనా దర్శకత్వంలో 'క్వీన్ ఆఫ్ కాశ్మీర్' బయోపిక్..!!

By:  Tupaki Desk   |   15 Jan 2021 5:00 PM IST
కంగనా దర్శకత్వంలో క్వీన్ ఆఫ్ కాశ్మీర్ బయోపిక్..!!
X
బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కంగనా.. అద్భుతమైన నటనతో రెండుసార్లు ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కంగనా గ్లామర్ షో కంటే తన నటన ద్వారానే ప్రత్యేక గుర్తింపు పొందింది. కంగనా చివరిగా తెరపై కనిపించిన సినిమా మణికర్ణిక. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో ఝాన్సీరాణి లక్ష్మీభాయి జీవిత చరిత్రగా తెరకెక్కింది. ఈ సినిమాతో హీరోయిన్ కంగనా కాస్తా తనలోని డైరెక్షన్ యాంగిల్ బయటపెట్టి దర్శకురాలిగా మారింది. ఇక ప్రస్తుతం కంగనా నటిస్తున్న తలైవి సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా దివంగత తమిళనాడు సీఎం, అలనాటి అందాలనటి జయలలిత బయోపిక్ గా రూపొందుతుంది. ఇదివరకే తలైవి ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే త్వరలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైంది కంగనా. అయోధ్యలో రామమందిరం నిర్మాణం.. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా.. ఈ అంశంతో సినిమా తీసేందుకు ప్రణాళికలు చేస్తుందనే సంగతి విదితమే. అదికాకుండా తాజాగా 'మణికర్ణిక రిటర్న్స్ ది లెజెండ్ ఆఫ్ దిడ్డా' అనే సినిమా చేయబోతుందని సమాచారం. ఇదివరకు మణికర్ణిక విషయంలో డైరెక్టర్ క్రిష్ తో సంయుక్తంగా దర్శకత్వం వహించిన కంగనా.. ఈసారి సోలోగా మణికర్ణిక రిటర్న్స్ తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో కాశ్మీర్ మహారాణి దిడ్డా జీవిత చరిత్రను చూపించబోతున్నారట. పూర్వం 980-1003 కాలంలో క్వీన్ దిడ్డా కాశ్మీర్ ను పరిపాలించింది. మరి ఇప్పుడు ఆమె బయోపిక్ ను బాలీవుడ్ క్వీన్ ఎలా చూపిస్తుందో చూడాలి. ఇంకా అధికారిక ప్రకటన వెలువడని ఈ సినిమాను మణికర్ణిక నిర్మాత కమల్ జైన్ నిర్మిస్తాడని ఇండస్ట్రీ టాక్.