Begin typing your search above and press return to search.

యుద్ధం ఇంత రియల్ గానా... ఎలా?

By:  Tupaki Desk   |   20 Oct 2015 8:00 AM GMT


నాగబాబు తనయుడు, మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో రూపొందింది కంచె. టీజర్ లాంఛ్ చేసినప్పటి నుంచి ఈ మూవీలోని విజువల్స్.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రెండో ప్రపంచయుద్ధంనాటి విజువల్స్ ని ఇంత వాస్తవంగా ఎలా చిత్రీకరించారంటూ ఆశ్చర్యపోయారు టాలీవుడ్, బాలీవుడ్ జనాలు. 70-80 ఏళ్ల వెనుక కాలానికి సంబంధించిన విజువల్స్ ని చూపడమంటే మామూలు విషయం కాదు. స్వాతంత్ర్యం రాకముందు స్టోరీని ఛాలెంజింగ్ గా తీసుకుని పిక్చరైజ్ చేశాడు క్రియేటర్ క్రిష్. అది కూడా చాలా తక్కువ సమయంలో తీయడం విశేషం.

జార్జియాకు వెళ్లి మరీ యుద్ధ సన్నివేశాలను కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతగా కళ్లను కట్టిపడేసే సన్నివేశాల చిత్రీకరణలో యూనిట్ పడ్డ కష్టాన్ని కొంచెం చూపే యత్నం చేశారు. గ్రాఫిక్స్ తో విజువల్ మాయాజాలానికి దూరంగా.. వీలైనంతవరకూ సహజంగానే సృష్టించి.. సన్నివేశాలను చిత్రీకరించిన విధానం అద్భుతమని చెప్పాలి. 12 నిమిషాల పాటు కనిపించనున్న రెండో ప్రపంచ యుద్ధ సన్నివేశాలు మూవీకే హైలైట్ కానున్నాయి. ఇందులో పోరాడిన ఓ సైనికుడి లవ్ స్టోరీని ప్రధానంగా చూపించబోతున్నాడు క్రిష్.

అక్టోబర్ 22న రిలీజ్ కానున్న కంచెపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దర్శకుడిగా క్రిష్ కెరీర్ ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే సత్తా ఈ మూవీకి ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అలాగే రాచకుటుంబానికి చెందిన యువతిగా నటించిన ప్రగ్యా జైస్వాల్ కు కూడా ఈ మూవీ టర్నింగ్ పాయింట్ కానుంది.