Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘కణం’

By:  Tupaki Desk   |   27 April 2018 12:54 PM GMT
మూవీ రివ్యూ: ‘కణం’
X
చిత్రం : ‘కణం’

నటీనటులు: సాయిపల్లవి - నాగశౌర్య - వెరోనికా - నిళల్ గళ్ రవి - ప్రియదర్శి - సంతాన భారతి తదితరులు
సంగీతం: శామ్ సీఎస్
ఛాయాగ్రహణం: నిరవ్ షా
నిర్మాతలు: కీర్తి చౌదరి - కిట్టు
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్

‘ఫిదా’ సినిమాతో తెలుగులో తిరుగులేని గుర్తింపు సంపాదించింది సాయిపల్లవి. ఆ తర్వాత ‘ఎంసీఏ’తో పలకరించిన సాయిపల్లవి.. ఇప్పుడు నాగశౌర్యతో కలిసి నటించిన ‘కణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకుముందు ‘నాన్న’.. ‘అభినేత్రి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ఎ.ఎల్.విజయ్ రూపొందించిన చిత్రమిది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తులసి (సాయిపల్లవి).. కృష్ణ (నాగశౌర్య) ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు.వీళ్లు కొత్తగా ఒక ఫ్లాట్లో కాపురానికి దిగుతారు. ఐతే కృష్ణ తండ్రి.. తులసి తల్లి.. వీళ్ల ఫ్యామిలీ డాక్టర్ ఒకరి తర్వాత ఒకరు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతారు. ఇందుకు కారణాలేంటో అంతుబట్టదు. వీళ్లందరూ ఒకే తరహాలో చనిపోయిన విషయం అర్థం చేసుకున్న తులసి.. తన భర్తకు కూడా ఆపద ఉందని గుర్తిస్తుంది. ఇంతకీ వీరి మరణాలకు కారణమేంటి.. తులసి తన భర్తను ఎలా కాపాడుకుంది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘కణం’ ఒక హార్రర్ థ్రిల్లర్. కానీ ఈ సినిమా ఎక్కడా కూడా భయపెట్టదు. థ్రిల్ చేయదు. రచయితలు.. దర్శకులు ఎంతో కసరత్తు చేసి ప్రేక్షకులకు ఊహకు అందని విధంగా కథాకథనాల్ని నడిపించే ప్రయత్నం చేసినా.. ఏదో ఒక దశలో గుట్టు పసిగట్టేసి.. ఇంతే కదా అని నిట్టూర్చేస్తున్న రోజులువి. ఇలాంటి రోజుల్లో తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. పది నిమిషాలకే కథ గుట్టేంటో విప్పేశాడు. సస్పెన్సుకు ఛాన్సే లేకుండా చేసుకున్నాడు. కథలో వరుసబెట్టి హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేస్తున్నదెవరనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. పోనీ ఆ పాత్రలు చనిపోయే విధానమైనా కొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. ఆ హత్యలు చేస్తున్నదెవరో హీరోయిన్ పసిగట్టడమే ఇంటర్వెల్ మలుపు. అక్కడ హీరోయిన్ షాకవుతుందే తప్ప మనకేమీ షాక్ ఉండదు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయంలో కూడా ప్రేక్షకుల అంచనాలేమీ తప్పవు. కేవలం 100 నిమిషాల్లో ముగిసిపోయే ఈ సినిమా మొత్తం చూశాక అసలెందుకీ సినిమా తీశారా అన్న సందేహం వెంటాడుతుంది. కొత్తగా దర్శకుడు ఏం చెప్పాడనిపిస్తుంది.

అబార్షన్ పాపం అని.. ఒక పసికందును కడుపులోనే చంపేయొద్దనే సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఎ.ఎల్.విజయ్. ఎంచుకున్న పాయింట్ మంచిదే. కానీ దాన్ని చెప్పిన తీరు ఏమంత కన్విన్సింగ్ గా లేదు. అబార్షన్ తప్పే కావచ్చు.. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది అనివార్యం కావచ్చేమో. ఇలాంటి అంశాలపై తీర్పులివ్వలేం. కచ్చితమైన అభిప్రాయాలు చెప్పలేం. ఐతే సినిమాలో చూపించిన విషయం మాత్రం ఏమంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఏది తప్పు ఏది ఒప్పు అనే చర్చను పక్కన పెట్టేస్తే.. సినిమాలో ఏదీ కొత్తగా అయితే అనిపించదు. తాను జన్మ కూడా ఇవ్వని ఒక పాపాయితో ఒక కూతురితో ఎమోషనల్ బాండింగ్ ను చాలా హృద్యంగా చూపించడంలో మాత్రం విజయ్ విజయవంతమయ్యాడు. సాయిపల్లవి-బేబీ వెరోనికా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మాత్రం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని చోట్ల కళ్లను తడి చేస్తాయి. వాళ్లిద్దరి నటన కూడా సినిమాలో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

మామూలు కథల్నే కొంచెం అందంగా చెబుతాడని పేరున్న విజయ్.. ‘కణం’లో మరీ సాదాసీదా కథను ఎంచుకుని.. దాన్ని సాధారణంగానే చెప్పాడు. ఎప్పట్లానే సాంకేతిక ఆకర్షణలు జోడించడంలో అతడి అభిరుచి కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. సాయిపల్లవి-వెరోనికా పాత్రల్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. అంతకుమించి ఇందులో ఏ విశేషం లేదు. కేవలం 100 నిమిషాల్లో ముగిసిపోయే సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్లుగా సాగిపోతుంటుంది. ఒక షార్ట్ ఫిలింను కొంచెం సాగదీసి సినిమాగా మార్చిన భావన కలుగుతుంది. కనీసం ప్రథమార్ధంలో ఈ హత్యల్ని ఎవరు చూపిస్తున్నారో చెప్పకుండా ఆ రహస్యాన్ని దాచి.. ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేసినా ప్రేక్షకులు కొంత సస్పెన్స్ ఫీలయ్యేవాళ్లేమో. కానీ విజయ్ అలా చేయకుండా ఫ్లాట్ నరేషన్ తో ఉస్సూరుమనిపించాడు. కేవలం 40 నిమిషాల్లో ముగిసిపోయే ద్వితీయార్ధంలో క్లైమాక్స్ మాత్రమే కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నిజానికి అది కూడా హడావుడిగా లాగించేసిన భావన కలిగిస్తుంది. మొత్తంగా ‘కణం’ కథాకథనాల పరంగా నిరాశ కలిగించి.. కొంత మేర ఎమోషనల్ గా కదిలించడం ద్వారా ప్రత్యేకత చాటుకుంటుంది.

నటీనటులు:

ఎప్పట్లాగే సాయిపల్లవి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన కదిలిస్తుంది. కానీ ఏ విశేషం లేని స్క్రిప్టును పైకి లేపేంత స్థాయి ఆమె పాత్రకు కూడా లేకపోయింది. బేబీ వెరోనికా చాన్నాళ్ల పాటు గుర్తుంటుంది. ఆ పాపాయి బలమైన ముద్ర వేస్తుంది. దియా పాత్రను ఆ పాపతో బాగా చేయించాడు విజయ్. నాగశౌర్య పాత్రకు తగ్గట్లు నటించాడు. అతడి ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఆ క్యారెక్టర్ ఇవ్వలేదు. ప్రియదర్శి ఓకే. అతడి పాత్ర ఆరంభంలో ఇరిటేట్ చేస్తుంది. తర్వాత అలవాటు పడిపోతాం. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘కణం’కు సాంకేతిక ఆకర్షణలన్నీ బాగా కుదిరాయి. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. పాపతో ముడిపడ్డ సన్నివేశాల్లో వచ్చే ఆర్.ఆర్ చాలా హృద్యంగా సాగుతుంది. ఉన్న రెండు పాటలూ ఆకట్టుకుంటాయి. నిరవ్ షా ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ అనిపిస్తుంది. ప్రతి దృశ్యం చాలా బాగా తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నటీనటులు.. సాంకేతిక నిపుణలందరి నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలో దర్శకుడు విజయ్ అభిరుచి కనిపిస్తుంది. కానీ కథా కథనాల విషయంలోనే అతను నిరాశ పరిచాడు. రైటింగ్ దగ్గరే విజయ్ ఏ ప్రత్యేకత చూపించలేకపోయాడు. దర్శకుడిగా అక్కడక్కడా తన ముద్ర చూపించినప్పటికీ ఫలితం లేకపోయింది.

చివరగా: కణం.. ఎమోషన్ ఉంది.. థ్రిల్ లేదు.

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre