Begin typing your search above and press return to search.

పుష్పని బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరింపులు

By:  Tupaki Desk   |   16 Dec 2021 5:04 PM IST
పుష్పని బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరింపులు
X
ఈ రోజుల్లో ప్ర‌తీ సినిమా ఏదో విధంగా వివాదంలో చిక్కుకుంటూనే వుంది. మా మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ఓ వ‌ర్గం.. మ‌మ్మల్ని కించ‌ప‌రిచారని ఓ వ‌ర్గం సినిమాల‌పై ఎదురుదాడికి దిగుతూనే వున్నారు.

తాజాగా ఇదే త‌ర‌హా వివాదాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రైజ్‌` ని వెంటాడుతూనే వున్నాయి. సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రం కోసం స‌మంత‌, బ‌న్నీల‌పై `ఊ అంట‌వా మావ‌..` సాంగ్ వివాదంలో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే. ఆంద‌ర ప్ర‌దేశ్ పురుషుల సంఘం ఈ పాట‌లోని ప‌దాలు పురుష స‌మాజాన్ని కించ‌ప‌రిచేవిగా వున్నాయంటూ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.

ఈ వివాదం స‌ద్దుమ‌నిగింది క‌దా అనుకుంటున్న త‌రుణంలో `పుష్ప‌`ని మ‌రో వివాదం చుట్టేసింది. వివ‌రాల్లోకి వెళితే... `పుష్ప` పాన్ ఇండియా సంచ‌ల‌నాలు సృష్టించ‌డానికి ఇంకా ఒక్క‌రోజే వుండ‌టంతో ఈ సినిమా రిలీజ్ ని క‌న్న‌డ నాట అడ్డుకుంటామని, సినిమాని బాయ్‌కాట్ చేస్తామ‌ని క‌న్న‌డ ప్రేక్ష‌కులు నెట్టింట హెచ్చిరిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్ కోసం త‌క్కువ థియేట‌ర్లు కేటాయింది.. తెలుగు వెర్ష‌న్ కి ఎక్కువ థియేట‌ర్ల‌ని ఇవ్వ‌డ‌మే ఇక్క‌డ వివాదానికి ప్రధాన కార‌ణంగా మారింది.

ఈ విష‌యం తెలుసుకున్న కొంత మంది క‌న్న‌డ ప్రేక్ష‌కులు `పుష్ప‌` టీమ్‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా #BoycottPushpaInKannada అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.

`ఇది ఆంధ్రా కాదు క‌ర్ణాట‌క‌. తెలుగు వెర్ష‌న్ త‌గ్గించి క‌న్న‌డ వెర్ష‌న్ ని అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయండి లేదంటే బాయ్‌కాట్ ని ఫేస్ చేసేందుకు సిద్ధం కండి అంటూ కొంత మంది క‌న్న‌డ ప్రేక్ష‌కులు చిత్ర బృందాన్నిసోష‌ల్ మీడియా వేదిక‌గా హెచ్చ‌రిస్తూ ట్రోల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇటీవ‌ల ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కోసం బెంగ‌ళూరు వ‌చ్చిన `పుష్ప‌` టీమ్ ని అక్క‌డి మీడియా ఇబ్బందిపెట్టే ప్ర‌య‌త్నం చేసింది కూడా. క‌న్న‌డ న‌టి అయి వుండి ర‌ష్మిక క‌న్న‌డ వెర్ష‌న్ కి ఎందుకు డ‌బ్బింగ్ చెప్ప‌లేద‌ని అక్క‌డి మీడియా నిల‌దీసింది. దీంతో స‌మ‌యాభావం వ‌ల్ల త‌ను డ‌బ్బింగ్ చెప్ప‌డం కుద‌ర‌లేద‌ని బ‌న్నీ .. ర‌ష్మిక త‌రుపున వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.