Begin typing your search above and press return to search.

'కనబడుటలేదు' టీజర్: మిస్టీరియస్ కేసును చేధించే డిటెక్టివ్‌ గా సునీల్..!

By:  Tupaki Desk   |   26 Jun 2021 6:51 AM GMT
కనబడుటలేదు టీజర్: మిస్టీరియస్ కేసును చేధించే డిటెక్టివ్‌ గా సునీల్..!
X
హీరో కమ్ కమెడియన్ సునీల్ - సుక్రాంత్‌ వీరెల్ల ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ''కనబడుటలేదు''. ఎమ్.బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్పార్క్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో సినిమా టీజర్ ను తాజాగా పాపులర్ హీరోయిన్ శ్రీ దివ్య రిలీజ్ చేసి, చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు.

'కనబడుటలేదు' టీజర్ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. ఈ కథ నగరంలో వరుస హత్యల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 'పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కానీ డిటెక్టివ్‌ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి' అంటూ సునీల్ ను కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్‌ గా పరిచయం చేశారు.

సిటీలో జరిగే హత్యలకు మాస్క్ ధరించి ఉన్న ఓ అజ్ఞాతవ్యక్తి కారణమనుకునే విధంగా టీజర్ లో చూపించారు. అతను ఎవరు? అతని ఉద్దేశ్యం ఏమిటి? అసలు ఎవరు కనబడటం లేదు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 'కనబడుటలేదు' టీజర్ సస్పెన్స్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉంది.

దర్శకుడు బలరాజు కథను వివరించడానికి ఒక విలక్షణమైన మార్గాన్ని ఎంచుకున్నాడని టీజర్‌ తో తెలుస్తోంది. 'ఈరోజుల్లో ప్రేమ పెళ్లి ఆడవారికి సెక్యూరిటీని ఇస్తుంది.. కానీ మగాడికి ఇన్సెక్యూరిటీని ఇస్తుంది' అనే డైలాగ్ ఆలోచిపజేస్తోంది. దీనికి మధు పొన్నాస్‌ అందించిన నేపథ్య సంగీతం.. సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ ఆకట్టునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి రవితేజ కుర్మాన ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'కనబడుటలేదు' చిత్రాన్ని సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శశిత కోన - యూగ్రామ్‌ - వైశాలిరాజ్ - ప్రవీణ్ - హిమజ - రవికృష్ణ - కిరీటి - సౌమ్య శెట్టి - 'C/o కంచరపాలెం' ఫేమ్ రాజు తదితరులు నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.