Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: బాబు హ‌త్యారాజకీయాల‌పై సినిమానా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 4:54 AM GMT
ట్రైల‌ర్: బాబు హ‌త్యారాజకీయాల‌పై సినిమానా?
X
పాలిటిక్స్ అంటే కుట్ర‌లు.. వెన్నుపోట్లు.. హ‌త్యా రాజ‌కీయాలు. ఇది జ‌నాల‌కు తెలియ‌నిది కాదు. అయితే దానికి కులం రంగును పులిమి డైరెక్టుగా కులాన్ని టైటిల్లోకి తెచ్చి ఆర్జీవీ ఆడుతున్న స‌రికొత్త‌ డ్రామా `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు`. క‌మ్మ‌లు అధికంగా ఉండే విజ‌య‌వాడ‌- అమ‌రావ‌తి గ‌డ్డ‌పై సీఎంగా అడుగుపెట్టి పాల‌న సాగిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్నోహ‌న్ రెడ్డి ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా క‌నిపిస్తుంటే... మూడు సార్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని పాలించిన మాజీ ముఖ్య‌మంత్రి.. తేదేపా అధినాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడును డైరెక్టుగానే విల‌న్ ని చేసి చూపిస్తున్నారు ఆర్జీవీ. పెద్ద తెర‌పై వ‌ర్మ చూపించే దాంట్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? అన్న‌ది అటుంచితే ఇరు వ‌ర్గాల మ‌ధ్య క‌క్ష‌లు కార్ప‌ణ్యాలు.. కుట్ర‌లు .. హ‌త్యా రాజ‌కీయాల్ని.. గూండాయిజాన్ని త‌న‌దైన శైలిలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ సంగ‌తుల‌న్నీ తాజాగా రిలీజైన `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` ట్రైల‌ర్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు అండ్ కో ఎత్తుగ‌డ‌లు కుయుక్తుల్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. యువ ముఖ్య‌మంత్రి పాల‌నకు అడ్డుక‌ట్ట వేయ‌డానికి కుట్ర జ‌రిగింది అన్న కోణాన్ని కూడా ఆర్జీవీ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎంచుకున్న పాత్ర‌ధారుల ఆహార్యం ఇంచుమించు స‌రితూగుతోంది. ఈ విష‌యంలో ఆర్జీవీ ఘ‌నాపాటి అన‌డంలో సందేహ‌మే లేదు. రంగం ఫేం అజ్మ‌ల్ అమీర్ ని సీఎం జ‌గ‌న్ పాత్ర‌కు ఎంచుకున్నారు. అంత‌గా పాపుల‌ర్ కాని న‌టీన‌టులు ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు. నారా చంద్ర‌బాబు నాయుడు .. దేవినేని.. లోకేష్ నాయుడు త‌దిత‌ర పాత్ర‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ముఖ క‌వ‌ళిక‌లు ఉండే ఆర్టిస్టుల్ని ఎంచుకునే ప్ర‌య‌త్నం చేశారు.

బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు గెలిచిన బాబు పార్టీ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ రుచి చూడ‌నంత ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన త‌ర్వాత కొన్ని చాలా విప‌రీత ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి... అంటూ ఆర్జీవీ నేరుగా వాయిస్ వినిపించారు. దీన‌ర్థం .. జ‌గ‌న్ సీఎం అయ్యాక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబు చేస్తున్న చేయ‌య‌బోతున్న కుట్ర‌ల ఫిక్ష‌న్ క‌థ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చూపిస్తున్నారా? అన్న ఆస‌క్తి పెరిగింది. విజ‌య‌వాడ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తేవాలి అంటూ సీఎం జ‌గ‌న్ అంటున్న తీరును బ‌ట్టి ఆ పాత్ర‌కు పాజిటివిటీని ఆపాదించే ప్ర‌య‌త్నం చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం బ్రేకింగ్ న్యూస్ అంటూ ఆర్జీవీ వాయిస్ ఓవ‌ర్ ఇస్తూ కంగారు పెట్టేశారు. అలాగే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఓ డైలాగ్ తో ప‌రిచ‌యం చేశారు. `ప్ర‌శ్నించేది లేదు ఇక చేయ‌డ‌మే!` అంటూ ప‌వ‌న్ ని కామిక్ స్టైల్లో చూపించ‌డం వెన‌క వ‌ర్మ వెట‌కారం బ‌య‌ట‌ప‌డింది. మొత్తానికి జ‌గ‌న్ హీరో.. చంద్ర‌బాబు విల‌న్.. ప‌వ‌న్ క‌మెడియ‌న్! అన్న కోణాన్ని ఆర్జీవీ ఇంటెన్సివ్ గానే చూపించ‌ద‌లిచాడ‌ని ట్రైల‌ర్ చెబుతోంది. వెట‌కారం.. వ్యంగ్యం.. సెటైర్ బావుంది కానీ.. క‌థ‌గా రక్తి క‌ట్టించేదిగా లేన‌ప్పుడు.. జ‌నాల‌కు తెలిసిన వాస్త‌వాల్ని చూపించేప్పుడు మ‌సి పూసి మారేడు కాయ చేయాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు కొన్ని ప‌రిణామాలు క‌ఠోరంగా ఉంటాయి. వాట‌న్నిటినీ ఎదుర్కొనేందుకు ఆర్జీవీ సిద్ధంగా ఉన్నారా? అన్న‌ది చూడాలి.