Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి, విక్రమ్ లతో కమల్ మల్టీస్టారర్!

By:  Tupaki Desk   |   15 Nov 2021 8:33 AM GMT
విజయ్ సేతుపతి, విక్రమ్ లతో కమల్ మల్టీస్టారర్!
X
సినిమాను కమలహాసన్ ఒక పనిగా అనుకోరు .. ఒక తపస్సుగా .. ఒక యజ్ఞంగా భావిస్తారు. అందువల్లనే ఎవరూ చేయలేని ప్రయోగాలను ఆయన చేశారు. ఎవరూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారు. తన తరువాత వచ్చిన నటులకు ఆయన ఒక గ్రంథాలయంలా మారారు. కమల్ చేయని పాత్ర ఏవుంది? కొత్తగా ఏం చేయాలనే విషయాన్ని తేల్చుకోవడానికి వర్ధమాన హీరోలకు చాలా రోజులు పడుతుంది. అంతలా ఆయన చాలా వైపులా నుంచి చాలా పాత్రలను కవర్ చేశారు. ఆ తరువాత కాలంలో వచ్చిన విక్రమ్ .. సూర్య వంటి నటులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.

కమల్ కి నటనపైనే కాదు .. కథ .. స్క్రీన్ ప్లే పై కూడా మంచి పట్టు ఉంది. స్టార్ డైరెక్టర్లు సైతం ఆయన అనుభవానికి జంకుతుంటారు. అయితే ఒక నటుడిగా కెమెరా ముందుకు వచ్చిన తరువాత, తనలోని దర్శకుడిని .. రచయితను ఆయన పక్కన పెట్టేస్తారు. దర్శకులు ఏం చెబితే అదే చేస్తారు. ఇక నిర్మాతగా కూడా ఆయన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై చాలా సినిమాలే చేశారు. తాజాగా అదే బ్యానర్లో ఆయన 'విక్రమ్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. నరేన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఇక ఇదే బ్యానర్లో కమల్ ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. విక్రమ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేయిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కమల్ లాక్ చేశారని అంటున్నారు. విక్రమ్ - విజయ్ సేతుపతిల క్రేజ్ కి తగిన విధంగానే వారి పాత్రలు రెండు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. ఈ స్క్రిప్ట్ పట్ల కమల్ చాలా సంతృప్తికరంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'విక్రమ్' పూర్తవగానే, కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో పది ప్రాజెక్టులు ఉన్నాయి. కొన్ని ఆరంభదశలో ఉంటే, మరికొన్ని ముగింపు దశలో ఉన్నాయి. వాటిలో 'విక్రమ్' కూడా ఒకటిగా ఉంది. ఈ సినిమాలో ఆయన చాలా పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇక హీరో విక్రమ్ విషయానికి వస్తే, ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఒకటి రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉంటే, మిగతావి ఆయా దశల్లో ఉన్నాయి. వాటిలో 'పొన్నియిన్ సెల్వన్' .. 'మహావీర్ కర్ణ' వంటి చారిత్రక చిత్రాలు కూడా ఉన్నాయి. విక్రమ్ - విజయ్ సేతుపతి సినిమాకి దర్శకుడు ఎవరనేదే కమల్ చెప్పాల్సి ఉంది.