Begin typing your search above and press return to search.

కమల్ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ లేదేంటి..??

By:  Tupaki Desk   |   31 May 2022 7:00 AM IST
కమల్ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ లేదేంటి..??
X
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ''విక్రమ్''. 2018లో వచ్చిన 'విశ్వరూపం 2' తర్వాత సీనియర్ హీరో తెర మీద కనిపించనున్న సినిమా ఇది. 'ఖైదీ' 'మాస్టర్' సినిమాలతో సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉండి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శక నటులు కలిసి చేసిన 'విక్రమ్' సినిమాపై టాలీవుడ్ లో బజ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ''విక్రమ్'' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో కమల్ అండ్ టీమ్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కమల్ హాసన్ ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లి 'విక్రమ్' సినిమాని ప్రమోట్ చేశారు. అలానే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తిరుగుతూ అన్ని భాషల మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమా విశేషాలు చెబుతున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మినిమమ్ ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం.

తెలుగులో 'విక్రమ్' చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యువ హీరో నితిన్ విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ట్రైలర్ మరియు ఓ సాంగ్ మాత్రమే వచ్చాయి. ప్రమోషన్స్ చేయకపోవడంతో.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా తెలుగులో ఈ సినిమాపై ఎలాంటి సందడి కనిపించడం లేదని తెలుస్తోంది.

ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న కమల్ హాసన్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నా సరే ఎంతో కొంత బజ్ ఉంటుంది. కానీ కమల్ ఇప్పుడు సేతుపతి - ఫాహాద్ ఫాజిల్ - సూర్య వంటి స్టార్స్ తో కలిసి వస్తున్నా 'విక్రమ్' సినిమా గురించి తెలుగులో అంతగా పట్టించుకోవడం లేదు.

అసలు చాలామందికి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది కూడా తెలియడం లేదు. అందుకేనేమో 'విక్రమ్' బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయినా.. ఆశించిన స్థాయిలో ఫిల్ అవడం లేదు. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ను గెస్టుగా పిలిచి మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి దీంతోనైనా సినిమాపై బజ్ ఏర్పడుతుందేమో చూడాలి.

ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలంటే తెలుగు మార్కెట్ కూడా కీలమనే చెప్పాలి. ఇటీవల వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా 'కేజీఎఫ్ 2' ఇక్కడ 100 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన 'ఖైదీ' 'మాస్టర్' సినిమాలు ఇక్కడ మంచి వసూళ్ళు రాబట్టాయి. ఈ క్రమంలో రాబోతున్న 'విక్రమ్' మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.