Begin typing your search above and press return to search.

వావ్‌.. విశ్వ‌రూపం-2 క‌దులుతోంది

By:  Tupaki Desk   |   20 Jun 2016 5:30 PM GMT
వావ్‌.. విశ్వ‌రూపం-2 క‌దులుతోంది
X
విశ్వ‌రూపం.. క‌మ‌ల్ హాస‌న్ క‌ల‌ల ప్రాజెక్టు. త‌నే స్వ‌యంగా నిర్మిస్తూ.. న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ రూపొందించిన ప్రాజెక్టులో తొలి స‌గం మూడేళ్ల కింద‌ట సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ద‌ర్శ‌కుడిగా క‌మ‌ల్ కు తొలి స‌క్సెస్ ఇదే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో క‌లిపి తొలి భాగం వంద కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఆ ఉత్సాహంలో చ‌క‌చ‌కా రెండో భాగం కూడా పూర్తి చేసేశాడు క‌మ‌ల్. 2014లోనే విశ్వ‌రూపం-2 టాకీ పార్ట్ పూర్త‌యినా.. ఇప్ప‌టిదాకా సినిమా బ‌య‌టికి రాలేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో సినిమా ఆగిపోయింది. నిర్మాత ఆస్కార్ ర‌విచంద్ర‌న్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

విశ్వరూపం తొలి భాగాన్ని తనే స్వయంగా నిర్మించిన కమల్ హాసన్.. రెండో భాగాన్ని మాత్రం ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేతికి అప్పగించి పెద్ద తప్పు చేశాడు. ఈ సినిమా షూటింగ్ జరిగేన్ని రోజులు పరిస్థితి బాగానే ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక డబ్బులు ఇవ్వలేదు ఆస్కార్. మొత్తం అంతా ‘ఐ’ మీదే పెట్టుబడిగా పెట్టేశాడు. ఐతే ఆ సినిమా విడుదలయ్యాకైనా విశ్వరూపం-2 పోస్ట్ ప్రొడక్షన్ మొదలవుతుందేమో అనుకుంటే.. సరిగ్గా ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని ఈ సినిమాను పక్కనబెట్టేశాడు ఆస్కార్. క‌మ‌ల్ కూడా ఏమీ చేయ‌లేక‌పోయాడు. ఐతే ఈ మ‌ధ్యే ఆర్థిక వివాదాల నుంచి తేరుకుంటున్న ఆస్కార్ ర‌విచంద్ర‌న్‌.. విశ్వ‌రూపం-2ను బ‌య‌టికి తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. క‌మ‌ల్ కూడా కొంత స‌మ‌యం దాని కోసం వెచ్చించ‌బోతున్నాడ‌ట‌. ఈ ఏడాది దీపావ‌ళికి లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విశ్వ‌రూపం-2ను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.