Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ న‌టుడికి క‌మ‌ల్ హాస‌న్ సెల్యూట్

By:  Tupaki Desk   |   23 July 2021 6:00 AM IST
లెజెండ‌రీ న‌టుడికి క‌మ‌ల్ హాస‌న్ సెల్యూట్
X
లెజెండరీ న‌టుడు శివాజీ గణేషన్ 20వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గుర్తు చేసుకున్నారు. ది గ్రేట్ శివాజీ గణేషన్ కు నివాళి అర్పించారు. శివాజీ గణేషన్‌ తెరపై నటనకంటూ ఒక మైలురాయిని నిర్ణయించి వెళ్లారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ పేర్కొన్నారు. నటనకే అడుగులు నేర్పిన న‌ట‌శిఖ‌రం శివాజి గణేషన్‌ తెరపై పోషించ‌ని పాత్రలు లేవు అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా శివాజీ గణేశన్ తో కలిసి దిగిన‌ రెండు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి. శివాజీ గణేషన్ ను తన గురువులలో ఒకరిగా భావించే కమల్ హాసన్ శివాజీ ఐకానిక్ తేవర్ మగన్ షూటింగ్ సందర్భంగా ఒకరితో ఒకరు మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ ని షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌మల్ ఓ ఎమోషనల్ నోట్ రాశారు. ఇందులో దిగ్గ‌జ న‌టుడి ప్రతిభ పై ప్రేమాభిమానాన్ని క‌న‌బ‌రిచారు. శివాజీ గణేషన్ సుదీర్ఘ అనారోగ్యంతో 21 జూలై 2001న‌ మరణించారు. అనేక ఇంటర్వ్యూలలో కమల్ హాసన్ తనపైనా.. త‌న‌ వృత్తిపైనా ఆయ‌న‌ చూపిన ప్రభావం గురించి మాట్లాడారు.

శివాజీ గణేషన్ ను దక్షిణ భారతదేశానికి చెందిన మార్లన్ బ్రాండోగా అభివ‌ర్ణించారు. అనేక అవార్డులు గెలుచుకున్న శివాజీని భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్ గా కీర్తించ‌బ‌డ్డారు. ``ఈ రోజు స్క్రీన్ ప్రెజెన్స్ కి ఒక మైలురాయిని నిర్దేశించిన నటుడు శివాజీ గణేశణ్‌.. నేడు ఆయ‌న‌ స్మారక దినం. సినిమా జీవించి ఉన్నంత కాలం న‌డిగర్ తిలగం చిత్రాలు తమిళ ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతాయి`` అని అన్నారు.

శివాజీ గణేశన్ జీవితం కెరీర్

తన అభిమానులు నడిగర్ తిలగం అని ప్రేమగా పిలిచే శివాజీ గణేషన్ దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను పరిపాలించారు. తమిళం- తెలుగు- కన్నడ- మలయాళ- హిందీ చిత్ర పరిశ్రమల్లో దాదాపు 288 చిత్రాల్లో నటించారు. 1960 లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఆఫ్రో-ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్) ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ చిత్ర వ్యక్తిగా శివాజీ గణేశన్ నిలిచారు. ఐదు దశాబ్దాల కెరీర్ లో శివాజీ గణేషన్ ఎన్నో గొప్ప అవార్డులు రివార్డులు అందుకున్నారు. జాతీయ అవార్డు స‌హా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఆయన పలువురు దక్షిణ భారత సినీ నటులకు స్ఫూర్తినిచ్చారు. మేటి న‌టుడిగా భ‌విష్య‌త్ సినీప్ర‌పంచానికి ఎన్నో కొత్త దారుల‌ను ఆవిష్క‌రంచారు. ఒక్క తమిళ భాషలోనే 275 చిత్రాల్లో నటించిన ఆయ‌న తెలుగు స‌హా ఇతర భాషల్లోనూ అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు.

2001 జూలై 22 ఆయ‌న నిష్క్ర‌మ‌ణం సినీప్ర‌పంచానికి పెద్ద షాక్ నిచ్చింది. ఈ బుధ‌వారం శివాజీ గణేషన్‌ 20వ వర్ధంతి సందర్భంగా పలు వురు సినీ ప్రముఖులు అభిమానులు నివాళులు అర్పించారు.

శివాజీ గణేషన్‌ పెద్ద కుమారుడు రామ్ కుమార్ నేటి వేకువ‌ఝామున‌ స్థానిక అడయారులో నెలకొల్పిన శివాజీ గణేషన్‌ స్మారక మండపానికి వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండవకొడుకు నటుడు ప్రభు.. మనవడు విక్రమ్‌ ప్రభు తాము ఉన్న చోటి నుంచే (వేరొక ఊరి ప్ర‌యాణంలో) నివాళులర్పించారు. తెలుగు చిత్ర‌సీమ‌లో లెజెండ‌రీ న‌టులు ఏఎన్నార్ .. ఎన్టీఆర్ .. చిరంజీవి వంటి ప్ర‌ముఖులు శివాజీగ‌ణేషన్ ని న‌టుడిగా ఎంతో ఆరాధిస్తార‌న్న సంగ‌తి తెలిసిన‌దే. ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ఆయ‌న న‌ట‌న‌కు వీరాభిమాని.