Begin typing your search above and press return to search.

క‌రుణ‌కు నివాళి...'విశ్వ‌రూపం-2' వాయిదా?

By:  Tupaki Desk   |   8 Aug 2018 11:19 AM GMT
క‌రుణ‌కు నివాళి...విశ్వ‌రూపం-2 వాయిదా?
X
రాజ‌కీయ కురువృద్ధుడు - దివంగ‌త నేత క‌రుణానిధి అంత్య‌క్రియ‌ల నేప‌థ్యంలో నేడు త‌మిళ‌నాడులో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో నేడు,రేపు సంతాప దినాలుగా ప్ర‌క‌టించారు. దివంగ క‌లైంగర్ కు నివాళిగా నేడు, రేపు త‌మిళ‌నాడులోని థియేటర్లు స్వ‌చ్ఛందంగా మూసి చేశారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల‌హాస‌న్ న‌టించిన `విశ్వ‌రూపం-2`విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. కరుణానిధికి సంతాపం తెలుపుతూ ఈ చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేయాలని కమల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరుణానిధి భౌతిక కాయానికి నివాళులర్పించిన కమల్‌....ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లంతా భావోద్వేగాల‌తో నిండి ఉన్న ఈ స‌మ‌యంలో సినిమా విడుద‌ల వాయిదా వేసేందుకు క‌మ‌ల్ మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని క‌మ‌ల్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

వాస్త‌వానికి ఈ నెల 10న‌ తెలుగు - తమిళంతోపాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా తమిళ వెర్ష‌న్ విడుద‌ల‌ను సవాల్ చేస్తూ పిరమిడ్ సైమరా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు వెళ్లింది. దీంతో, ఆ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని అంతా భావించారు. అయితే, `విశ్వరూపం 2` రిలీజ్ వాయిదా పడలేద‌ని, షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నామని క‌మ‌ల్ ప్రకటించారు. అయితే, తాజాగా క‌రుణానిధి మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌మ‌ల్ విడుద‌ల‌ను వాయిదా వేసేందుకు మొగ్గు చూపుతున్నార‌ట‌. అయితే, వాయిదాపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. కమల్‌ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ తోపాటు, ఆస్కార్‌ ఫిలింస్ `విశ్వరూపం-2 ను` సంయుక్తంగా నిర్మించాయి.