Begin typing your search above and press return to search.

రాజమౌళి.. ఐ యామ్ వెరీ సారీ

By:  Tupaki Desk   |   15 May 2017 11:12 AM GMT
రాజమౌళి.. ఐ యామ్ వెరీ సారీ
X
మనల్ని విమర్శించిన నోటితోనే నేను మాట్లాడింది తప్పు.. నేను తప్పు చేశాను అంటూ క్షమాపణ చెప్పించడం అంత తేలికేం కాదు. రీసెంట్ గా బాలీవుడ్ లో ఒకరికి ఇలా సారీ చెప్పక తప్పింది కాదు. కమాల్ ఆర్.ఖాన్ అని బాలీవుడ్ లో తనను తాను గొప్ప విమర్శకుడుగా చెప్పుకొనే వ్యక్తి ఒకడున్నాడు. తన వివాదాస్పద కామెంట్స్ తో అందరికీ విసుగు తెప్పిస్తుంటాడు. ముఖ్యంగా సౌత్ స్టార్స్ పై నోరేసుకుని పడిపోతుంటాడు. బాహుబలి-2 లో భళ్లాలదేవుడిగా నటించి అందరినీ మెప్పించిన రానాపై కూడా కామెంట్స్ చేశాడు. అతడో బ్రెయిన్ లెస్ ఈడియట్ అంటూ రానా తన ట్విట్టర్ అకౌంట్లో అతడిని బ్లాక్ చేసి పారేశాడు.

బాహుబలి-2 రిలీజ్ కాకముందు ఇదో సుత్తి సినిమా అంటూ కమాల్ ఆర్.ఖాన్ వ్యాఖ్యానించాడు. సౌత్ లో ఇలాంటి సినిమాలకు ఆదరణ ఉండొచ్చేమో కానీ హిందీ జనాలు అసలు లెక్క చేయరని తేల్చిపారేశాడు. కానీ అతడి అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. బాహుబలి-2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పట్టింది. కేవలం హిందీలోనే రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రూ. 1330 కోట్లు దాటాయి. దీంతో కమల్ ఆర్.ఖాన్ కు సౌండ్ పడిపోయింది. దీంతో ఇప్పుడేమంటావు అంటూ సోషల్ మీడియాలో అతడిపై ఎదురుదాడి మొదలైంది. నీ తప్పు ఒప్పుకోవాలంటూ ఫోర్స్ పెరిగిపోయింది.

దీంతో ఎట్టకేలకు కమాల్ ఆర్. ఖాన్ దిగొచ్చాడు. ట్విట్టర్ లో రాజమౌళిని క్షమాపణ కోరాడు. ‘‘బాహుబలి-2పై నేను ఇచ్చిన తప్పుడు రివ్యూకు వెరీ సారీ. ఈ సినిమా నాకు నచ్చలేదు. కానీ జనాలందరికీ నచ్చింది. జనం మాట దేవుడి మాటతో సమానం. సారీ ఎస్ఎస్ రాజమౌళి’’ అంటూ తాజాగా ట్వీట్ చేశాడు.