Begin typing your search above and press return to search.

హలో.. అసలు ఛాన్సెలా వచ్చింది?

By:  Tupaki Desk   |   24 Dec 2017 7:37 PM IST
హలో.. అసలు ఛాన్సెలా వచ్చింది?
X
అక్కినేని అఖిల్ కొత్త సినిమా ‘హలో’లో కథానాయిక కోసం చాన్నాళ్ల పాటు వేట సాగింది. ఆలియా భట్ అని.. ఇంకెవరో అని చాలా పేర్లు తెరమీదికి వచ్చాయి. చివరికి మలయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ తనయురాలు కళ్యాణి ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. మరి ఈమెనే ఏరి కోరి ఎలా కథానాయికగా ఎంచుకున్నారు.. ఆమెకు అసలెలా అవకాశం వచ్చింది.. ఈ విషయాన్ని కళ్యాణి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘హలో సినిమాలో కథానాయిక కోసం చాన్నాళ్ల పాటు వెతికారని తెలుసు. ఈ చిత్ర కెమెరామన్ వినోద్ భార్యకు.. మా ఫ్యామిలీకి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. నాగార్జున గారికి కూడా వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్లే నన్ను రెకమండ్ చేశారు. నా ఫేస్ బుక్ లో ఫొటోలు చూసి ఆడిషన్ కు పిలిచారు. నిజానికి ‘హలో’ డైరెక్టర్ విక్రమ్ కుమార్ మా నాన్న దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశారు. ఆయనకు నేను ముందే తెలుసు. అయినప్పటికీ ఆడిషన్ చేశాకే నన్ను ఓకే చేశారు.

మా నాన్న కావాలంటే తనే విక్రమ్ ను అడిగి నాతో సినిమా చేయమని అడిగి ఉండొచ్చు. కానీ నాన్న అలా చేయలేదు. వాళ్ల వైపు నుంచే ప్రపోజల్ వచ్చింది. మా నాన్న నన్ను కథానాయికగా పరిచయం చేయడానికి కూడా ఇష్టపడలేదు. నా అంతట నేను పేరు తెచ్చుకోవాలని.. వేరే దర్శకుల్ని ఇంప్రెస్ చేసి నటిగా రుజువు చేసుకోవాలని అనుకున్నారు. నాకంటూ ఒక గుర్తింపు వచ్చాక మా నాన్న దర్శకత్వంలో నటిస్తే నటించొచ్చేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఆయనతో కలిసి పని చేయను’’ అని కళ్యాణి అంది.