Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్ఫూర్తితో ఆర్టిస్టుల‌కు 'క‌ళ్యాణ‌ల‌క్ష్మి'!

By:  Tupaki Desk   |   24 Dec 2018 8:51 AM GMT
కేసీఆర్ స్ఫూర్తితో ఆర్టిస్టుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మి!
X
ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు! పైగా సినిమావాళ్లు పెళ్లి చేసుకోవాలంటే అంత సులువేం కాదు. ఆ రంగంలో ఉన్న‌వారికి పిల్ల దొర‌క‌దు. ఆడ‌పిల్ల పెళ్లి అయితే మ‌రీ క‌ష్టం. ఆర్టిస్టుల వార‌సుల‌కు - సుపుత్రిక‌ల‌కు పెళ్లిల్లు చేయాలంటే నానా తంటాలు ప‌డాల్సి ఉంటుంది. ఓ వైపు నింద‌లు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌వు. సినిమావాళ్ల‌కు పెళ్లిల్లేంటి అని తీసిపారేసేవాళ్లుంటారు. ఛీద‌రింపులు.. ఈస‌డింపులు స‌రేస‌రి! దానికి తోడు ఆర్టిస్టు పేద‌రికంలో ఉంటే ఇక అంతే సంగ‌తి.

అందుకే అలాంటి అభాగ్యుల కుటుంబాల్లో అభాగిణుల‌కు సాయం చేసేందుకు మూవీ ఆర్టిస్టుల సంఘం ఒక బృహ‌త్త‌ర‌మైన ప‌థ‌కాన్ని ప్రారంభించింది. టాలీవుడ్ 88ఏళ్ల చ‌రిత్ర‌లో ఇది ఇంత‌కాలం లేనిది. ఒక మంచి ఆలోచ‌న‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని అంటారు. అస‌లు పేద ఆర్టిస్టుల పిల్ల‌ల‌కు చ‌దువుల‌కు కానీ - లేదా పెళ్లిళ్ల‌కు కానీ త‌గినంత ఆర్థిక స్థోమ‌త లేనివాళ్లు ఎంద‌రో ఈ రంగంలో ఉన్నారు. ఇండ‌స్ట్రీ ఎంతో పెద్దది. ఇందులో ఏ కొంద‌రో అధికాదాయ వ‌ర్గాలు ఉంటారు. కానీ పేద‌లే ఎక్కువ‌మంది కొలువుంటారు. రంగుల ప్ర‌పంచంలో క‌ష్ట‌న‌ష్టాలు - సాధ‌క‌బాధ‌ల గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువే.

అందుకే తాజాగా మూవీ ఆర్టిస్టుల సంఘం ప్రారంభించిన ఆర్టిస్టుల‌కు `క‌ళ్యాణ ల‌క్ష్మి` ప‌థ‌కానికి విశేషమైన ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక‌పై పేద క‌ళాకారిణులు.. పేద ఆర్టిస్టుల పిల్ల‌ల‌కు మూవీ ఆర్టిస్టుల సంఘం ఆర్థిక సాయం చేయ‌నుంది. క‌ళ్యాణ ల‌క్ష్మిలు పెళ్లి చేసుకోవాలంటే ఎలా? అన్న దిగులు ప‌డాల్సిన ప‌నేలేదు. అందుకోసం భారీగా నిధి సేక‌ర‌ణ‌కు స‌న్నాహాలు చేస్తోంది మా అసోసియేష‌న్. అందుకు సూప‌ర్ స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల‌ స‌హా రెబ‌ల్‌ స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌ల దంప‌తులు ఇతోధికంగా సాయానికి ముందుకొచ్చారు. తొలిగా మూవీ ఆర్టిస్టుల డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్రంలో ఈ పెద్ద‌లు ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ప్ర‌క‌టించారు. కృష్ణంరాజు భార్య పేద క‌ళాకారిణులు పెళ్లి సాయం కోరితే రూ.ల‌క్ష సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. విజ‌య‌నిర్మ‌ల రూ.1.5ల‌క్ష‌ల సాయం అందిస్తామ‌ని .. క‌ష్టాల్లో ఉన్న క‌ళాకారుల పిల్ల‌ల‌కు త‌మ వంతు సాయ‌మందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి అన్ని వేళ‌లా పేద ఆర్టిస్టుల‌కు సాయం అందుతోంది. ఇత‌ర పెద్ద ఫ్యామిలీలు స్పందించి ప‌రిశ్ర‌మ‌లో ఉన్న పేద ఆర్టిస్టుల పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు సాయం చేసేందుకు ముందుకు రావాల‌ని ఈ సంద‌ర్భంగా ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన పథకానికి స్ఫూర్తిగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఈ నిర్ణ‌యం తీసుకుంది. స్ఫూర్తి ఏదైనా ఇది మంచి నిర్ణ‌య‌మేన‌న్న ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే మూవీఆర్టిస్టుల సంఘం ఇలాంటి బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్పుడు అందులో నిజాయితీ చూపించాలి. చొర‌వ‌గా అస‌లు క‌ష్టం ఎవ‌రికి ఉందో తెలుసుకుని ఆర్థిక సాయం చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. త‌ప్పులు చేసి దొరికిపోయినా, కొన్ని మంచి ప‌నులు చేసేందుకు ప్ర‌స్తుత‌ మా అధ్య‌క్షుడు శివాజీ రాజా లాంటి వారు ప్ర‌య‌త్నించారు. ప‌లువురు పేద క‌ళాకారుల‌కు జ‌న‌ర‌ల్ బాడీ మీటింగుల్లో సాయం అందేలా చేసిన ఘ‌న‌త శివాజీరాజాదే. అంత‌కుముందు లేని క‌ల్చ‌ర్ ని వీళ్లు ప్ర‌వేశ‌పెట్టార‌న్న‌ది వాస్త‌వం. అయితే వివాదాల న‌డుమ ఇవ‌న్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు పేద‌ల‌కు క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం ప్ర‌శంసించ‌ద‌గిన‌ది. అలాగే పేద క‌ళాకారుల‌కు ఫించ‌ను అందేలా చేయ‌డం అభినంద‌నీయం. ప్ర‌భుత్వం నుంచి క‌ళాకారుల‌కు నిధి సేక‌రించి వారిని క‌ష్టాల్లో ఆదుకునేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అందుకు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి వ‌ర్యులు ఇతోధికంగా సాయం చేయాల్సి ఉంటుంది.