Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : షేర్

By:  Tupaki Desk   |   30 Oct 2015 10:06 AM GMT
సినిమా రివ్యూ : షేర్
X
చిత్రం - షేర్

నటీనటులు- కళ్యాణ్ రామ్ - సోనాల్ చౌహాన్ - బ్రహ్మానందం - రావు రమేష్ - రోహిణి - ఆలీ - షాయాజి షిండే - విక్రమ్ జీత్ మాలిక్ - ముకేష్ రుషి - ఆశిష్ విద్యార్థి - షఫి - పృథ్వీ - తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం- తమన్
ఛాయాగ్రహణం- సర్వేష్ మురారి
కథ - మాటలు- డైమండ్ రత్నబాబు
నిర్మాత- కొమర వెంకటేష్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం- మల్లికార్జున్

వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఈ ఏడాదిలో రెండో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. అదే.. షేర్. మరి కళ్యాణ్ రామ్ ఫామ్ కొనసాగించాడా లేదా? కళ్యాణ్ రామ్ తో రెండు ఫ్లాపులిచ్చినా మళ్లీ అతడితో సినిమా చేసే అవకాశం చేసే అవకాశం దక్కించుకున్న మల్లికార్జున్ తన హీరో నమ్మకాన్ని నిలబెట్టాడా లేదా? చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (కళ్యాణ్ రామ్) తన ఫ్యామిలీకి అండగా నిలిచే దమ్మున్న కుర్రాడు. అతడికి తల్లిదండ్రులన్నా, తమ్ముడన్నా చాలా ఇష్టం. తన ఫ్రెండు ప్రేమించిన అమ్మాయిని పప్పీ (విక్రమ్ జీత్ మాలిక్) అనే రౌడీ బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే ఎత్తుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయిస్తాడు గౌతమ్. దీంతో పప్పీ.. గౌతమ్ మీద పగబడతాడు. గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లాడతానని సవాల్ చేస్తాడు. ఇంతలో గౌతమ్.. నందిని (సోనాల్ చౌహాన్) ప్రేమలో పడతాడు. పప్పీ ఆమెను ఎత్తుకొచ్చేస్తాడు. ఆ తర్వాత పప్పీ దగ్గరికే చేరి.. అతడి వెనుక ఉన్న వాళ్లు ఒక్కొక్కరినే చంపుకుంటూ వస్తాడు గౌతమ్. నందిని కోసమే ఇదంతా చేస్తున్నట్లు గౌతమ్ నమ్మిస్తాడు కానీ.. అసలు కారణం వేరే ఉంటుంది. ఆ కారణం ఏంటి? చివరికి తాను అనుకున్నది గౌతమ్ సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని సినిమాల విషయంలో లాజిక్కుల గురించి జనాలు పట్టించుకోరు. రొటీన్ గా ఉన్నా క్షమించేస్తారు. ఐతే ప్రేక్షకుల్ని వినోదం మత్తులో ముంచెత్తినపుడే అలా జరుగుతుంది. ‘పటాస్’ సినిమా ఆ విషయంలో విజయం సాధించింది. ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ సాగిపోవడంతో లాజిక్కుల గురించి, రొటీన్ గా ఉండటం కంప్లైంట్స్ ఏమీ లేకుండా సినిమా చూశారు, ఆదరించారు ఆడియన్స్. ఐతే అన్ని సినిమాల విషయంలోనూ అలా జరగదు. అందుకు ‘షేర్’ సరైన ఉదాహరణ.

పటాస్ స్టయిల్లోనే లాజిక్కులు లేకుండా, చాలా రొటీన్ గా సాగిపోయే సినిమా ‘షేర్’. కానీ ఈ సినిమా ‘పటాస్’లా వినోదంలో ముంచెత్తలేదు. రెండు గంటల్లోపే నిడివి ఉన్నా కూడా బోర్ కొట్టించేసింది ‘షేర్’. సోసోగా ఉండే ఎంటర్ టైన్ మెంట్ ను నమ్మకుని.. బండి లాగించేద్దామని చూశాడు మల్లికార్జున్. ‘కత్తి’ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో.. కథ మీద మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా, రొటీన్ మాస్ మసాలా అంశాల మీదే డిపెండ్ అయిపోయాడతను. దురదృష్టవశాత్తూ ఇందులో కామెడీ అంతగా పండలేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథాకథనాలు నిరాశ పరిస్తే.. రసం లేని కామెడీ నవ్వించలేకపోయింది.

సినిమా మొదలైన తీరు.. ‘షేర్’ మీద ఆసక్తి పుట్టేలా చేస్తుంది. హీరోయిన్ మీద కథ నడపడం బాగానే అనిపిస్తుంది. నా పెళ్లి చెడగొట్టావ్ కాబట్టి, నువ్వు ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటూ విలన్ ఛాలెంజ్ చేయడం.. దానికి హీరో ప్రతి సవాల్ విసరడం.. ఇదంతా చూస్తే బేసిక్ ప్లాట్ కొంచెం డిఫరెంటుగానే ఉన్నట్లనిపిస్తుంది. ఐతే ఆ తర్వాత హీరో హీరోయిన్ల లవ్ స్టోరీతోనే కథనం గాడి తప్పుతుంది.

జాతీయ జెండాను కింద పడకుండా పట్టుకున్నాడని.. హీరోను చూడకుండానే హీరోయిన్ లవ్వులో పడిపోవడం.. హీరో కూడా అంతే సిల్లీగా ఆమెకు ఫ్లాటై పోవడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చే డ్రామా ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. మధ్యలో బ్రహ్మిని తీసుకొచ్చి కామెడీ చేయించాలని చూశారు కానీ.. అదేమంత వర్కవుట్ కాలేదు. ఉన్నంతలో విలన్ బ్యాచ్ కు, హీరోకు మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త పండటంతో సోసోగా ప్రథమార్ధం ముగుస్తుంది.

విలన్ క్యారెక్టర్ బలంగా ఉండుంటే ద్వితీయార్ధం మీద ఆసక్తి పెరిగేది కానీ.. అతడి పాత్రను ముందే తేల్చేశారు. అంత బిల్డప్ ఇచ్చి సవాల్ చేసిన విలన్ చాలా సిల్లీగా ప్రవర్తిస్తాడు. హీరోకు, అతడికి మధ్య ఎత్తులు పైఎత్తులు ఏమీ ఉండవు. మన తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం హీరో విలన్ పంచన చేరి అతణ్ని కావాల్సినట్లు ఆడించేస్తుంటే.. ఆసక్తి సన్నగిల్లిపోతుంది. విలన్ చాలా సింపుల్ గా విలన్ గ్యాంగులో ఒక్కొక్కర్నే లేపేస్తుంటాడు. మరోవైపు లుంగీబాబాగా ఎమ్మెస్ నారాయణతో కామెడీ ట్రై చేశారు కానీ.. నవ్వులు పండలేదు. ఉన్నంతలో పృథ్వీ ‘చిరాగ్గా’ అనే ఊతపదంతో కొన్ని పంచులేసి నవ్వించాడు.

హీరో మిషన్ వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని ఊహించడం ప్రేక్షకుడికి పెద్ద కష్టమేమీ కాదు. ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ ప్రేక్షకుల స్టన్ అయిపోయేలా ఏమీ చేయదు. ఇదొక రొటీన్ రివెంజ్ డ్రామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పటికి. ఇక క్లైమాక్స్ కూడా మామూలుగా ముగుస్తుంది. మొత్తంగా చూస్తే.. రెండుగంటల్లోపు సినిమాలో వినోదం పండింది, ప్రేక్షకుణ్ని ఎంగేజ్ చేసింది తక్కువ సమయమే. కథాకథనాల్లో కొత్తదనమూ లేక, ఎంటర్టైన్మెంటూ పండక బోర్ కొట్టించేశాడు ‘షేర్’.

నటీనటులు:

‘పటాస్’ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కళ్యాణ్ రామ్ నటనలో కనిపిస్తుంది. అతను ఉత్సాహంగానే నటించాడు. డ్యాన్సులు, ఫైట్లు బాగానే చేశాడు. ఐతే అతడికి గౌతమ్ పాత్ర పెద్దగా సవాలేమీ విసరలేదు. అంతా రొటీన్ వ్యవహారం కావడంతో మామూలుగా చేసుకెళ్లిపోయాడు. సోనాల్ చౌహాన్ నటించాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది. ఆమె చలాకీతనం ఆకట్టుకుంటుంది. గ్లామరస్ గా కనిపించి.. బాగానే అందాల విందు చేసింది. విలన్ విక్రమ్ జీత్ జోకర్ టైపు పాత్ర చేశాడు. ముకేష్ రుషిది కూడా రొటీన్ క్యారెక్టరే. రావు రమేష్, రోహిణి బాగా చేశారు. బ్రహ్మానందం నవ్వించడానికి చాలా ప్రయత్నమే చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. ఆలీ కామెడీ కొంచెం పర్వాలేదు. పృథ్వీ బాగానే నవ్వించాడు. అతడి పాత్ర ఇంకా పొడిగించి ఉంటే బావుండేదనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రత్యేకత చూపించడానికి ఏమీ ప్రయత్నించలేదు. పాటలు సోసోగా అనిపిస్తాయి. మళ్లీ వినాలనిపించే ట్యూన్లేమీ లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ లేవు. కళ్యాణ్ రామ్ సొంత సినిమాల్లో కనిపించే క్వాలిటీ ఇందులో లేదు. బడ్జెట్ పరిమితులున్నాయని సన్నివేశాల్లో తెలుస్తూనే ఉంటుంది. డైమండ్ రత్నబాబు కథా సహకారంతో పాటు మాటలు కూడా అందించాడు. కొన్ని చోట్ల పంచ్ డైలాగులు పేలాయి. మల్లికార్జున్ ను ‘షేర్’ డైరెక్టర్ గా కంటే.. ‘కత్తి’ దర్శకుడిగానే గుర్తుంచుకోవడం బెటరేమో. హిట్టు కొట్టి తీరాల్సిన పరిస్థితిలో అతను కథాకథనాల మీద అతను మరీ లాజిక్కుల్లేని ఇంత రొటీన్ కథాకథనాల్ని నమ్ముకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అతడి స్క్రీన్ ప్లేలో బిగువు లేదు. దర్శకుడిగా అతను ప్రత్యేకత ఏమీ చూపించలేకపోయాడు.

చివరగా: షేర్.. బోర్ కొట్టించేశాడు

రేటింగ్: 2/5

#Sher, #SherMovie, #Kalyanram, #KalyanramSher, #SherReview, #SherMovieReview, #SherTalk, #SherRating


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre