Begin typing your search above and press return to search.

ఆ హీరో కి డిమాండ్ పెరిగిందా?

By:  Tupaki Desk   |   9 Aug 2022 12:30 PM GMT
ఆ హీరో కి డిమాండ్ పెరిగిందా?
X
నందమూరి కళ్యాణ్ రామ్ ''బింబిసార'' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ మూవీ థియేటర్లలో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. ఈ విజయంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇలాంటి సక్సెస్ కోసమే తాము ఇన్నాళ్లు వేచి చూసిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి 'తొలి చూపులోనే' చిత్రంతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ రామ్.. ఆశించిన స్థాయిలో సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. సొంత బ్యానర్ లో చేసిన 'అతనొక్కడే' 'పటాస్' మరియు '118' సినిమాలు మినహా మరే సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేదు.

ఈ క్రమంలో ప్రయోగాత్మక సినిమాలు ఎంచుకొని విలక్షణమైన పాత్రలు ట్రై చేసినా కళ్యాణ్ రామ్ కు ఆశించిన విజయం మాత్రం వరించలేదు. చివరి సినిమా 'ఎంతమంచి వాడవురా' ప్లాప్ అవడంతో అతని కెరీర్ సందిగ్ధంలో పడిందనే కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు 'బింబిసార' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. గత శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ కాబడిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ అందించడమే కాదు.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టాలీవుడ్ కు ఊపిరి పోసింది.

'బింబిసార' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ విజయం హీరోకి నూతనోత్సాహం ఇవ్వడమే కాదు.. అతని మార్కెట్ ని పెంచేసింది. ఇది రాబోయే సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కు హెల్ప్ అవుతోందని తెలుస్తోంది.

కల్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఓ మూవీ చేస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ నిర్మింస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అయింది.

అలానే నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. 'డెవిల్' అనే మూవీ చేస్తున్నాడు కళ్యాణ్. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామా. అంతేకాదు కళ్యాణ్ రామ్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.

ఇదే క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ఓ మూవీకి కమిట్ అయ్యారు. 118 ఫేమ్ కేవీ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇలా కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 'బింబిసార 2' కూడా ఉంటుందని ఇది వరకే ప్రకటించారు.

'బింబిసార' సినిమా రిజల్ట్ ని బట్టి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాల వివరాలు వెల్లడించాలని వేచి చూస్తున్నారు. ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో.. నందమూరి హీరో నటిస్తున్న సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ సెట్ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో సక్సెస్ నే పరిగణనలోకి తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ కూడా గాడిలో పడినట్లుగానే కనిపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ మరో రెండు హిట్లు పడితే నందమూరి హీరోకి తిరుగుండదని సినీ అభిమానులు భావిస్తున్నారు.