Begin typing your search above and press return to search.

చిరు అల్లుడి రెండో సినిమా ఫిక్స్

By:  Tupaki Desk   |   22 Jun 2018 6:34 AM GMT
చిరు అల్లుడి రెండో సినిమా ఫిక్స్
X
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థాయేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా ఆయన చూడని శిఖరాల్లేవు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలుగా స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ కోవలోనే చిరు చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతడి తొలి చిత్రాన్ని సాయి కొర్రపాటి లాంటి పెద్ద నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘విజేత’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఆ సినిమా విడుదల కాకముందే కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కూడా కన్ఫమ్ అయినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు ఏంటి అనే వివరాలు వెల్లడి కాలేదు కానీ.. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో కళ్యాణ్ రెండో సినిమా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా ఓకే కావడంతో చిరంజీవి ప్రమేయం ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో. తన కొడుకు కోసం కానీ.. ఇతర మెగా హీరోల కోసం కానీ చిరు లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. ఎవరికి వాళ్లు కెరీర్ ఆరంభంలోనే క్రేజ్ సంపాదించుకున్నారు. అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఉభయతారకంగా ఉండేలా నిర్మాతలు వాళ్లతో సినిమాలు చేశారు. ఐతే కళ్యాణ్ ఎంతైనా మెగా ఫ్యామిలీవాడు కాదు. నటుడిగా అతడిపై భరోసా లేదు. దీంతో నిర్మాతలు ముందుకు రావడం కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో చిరు రంగంలోకి దిగాల్సి వస్తోందట. ఆయన మాటను మన్నించి ఓ పెద్ద నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చాడట. అలాగే ఇంకో ఒకరిద్దరు కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అల్లుడి కోసం చిరు ఎన్నడూ చేయనిది చేస్తున్నారన్నమాట.