Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు బాగా మాట్లాడాడబ్బా...

By:  Tupaki Desk   |   25 Jun 2018 4:21 AM GMT
మెగా అల్లుడు బాగా మాట్లాడాడబ్బా...
X
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్లలో చూస్తే కళ్యాణ్ పర్వాలేదన్నట్లే అనిపించాడు. సినిమాలో పూర్తి స్థాయిలో ఎలా చేశాడో చూడాలి. నటన సంగతలా ఉంచితే కళ్యాణ్ తొలిసారి పాల్గొన్న పబ్లిక్ ఈవెంట్లో ఆకట్టుకున్నాడు. ‘విజేత’ ప్రి రిలీజ్ వేడుకలో కళ్యాణ్.. ఏ తడబాటు లేకుండా మాట్లాడాడు. అతడిలో ఏ బెరుకూ కనిపించలేదు. ఒక ప్రసంగంలాగా కాకుండా ముందున్న కొంతమందితో సంభాషిస్తున్నట్లుగా చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు కళ్యాణ్. టీజర్.. ట్రైలర్లలో అక్కడక్కడా బాడీ లాంగ్వేజ్ కొంచెం తేడాగా కనిపించింది కానీ.. ఈ స్పీచ్ ఇచ్చేటపుడు మాత్రం అతను చాలా ఫ్రీగా కనిపించాడు.

తన సినిమా గురించి.. తన నటన గురించి తానేమీ మాట్లాడనని.. కొన్ని రోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది కాబట్టి అది చూశాక అభిప్రాయం చెప్పాలని చెబుతూ కళ్యాణ్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. అందరూ చిరంజీవిని తెగ పొగిడేసి మెగా అభిమానుల ప్రాపకం కోసం ప్రయత్నిస్తాడని అనుకున్నారు కానీ అతనలాంటిదేమీ చేయలేదు. ఎక్కడా డ్రామా ప్లే చేయలేదు. ప్రేక్షక దేవుళ్లు.. రుణపడి ఉంటాను.. అది నా అదృష్టం.. ఇంకో జన్మంటూ ఉంటే.. తరహా నాటకీయ పదాలేమీ లేకుండా సింపుల్ గా మాట్లాడి మెప్పించాడు కళ్యాణ్. దర్శకుడు రాకేశ్ శశి తనను ఒక బ్రదర్ లాగా చూసుకున్నాడని.. సీనియర్ ఆర్టిస్టులు మురళీ శర్మ.. తనికెళ్ల భరణి కూడా తనకు మంచి సలహాలిచ్చారని అన్న కళ్యాణ్.. నిర్మాత సాయి కొర్రపాటి.. కెమెరామన్ సెంథిల్ కుమార్.. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్.. హీరోయిన్ మాళవికల గురించి కూడా సింపుల్ గా.. చక్కగా మాట్లాడాడు.