Begin typing your search above and press return to search.

పోతూ పోతూ ‘బిగ్ బాస్’ను షేక్ చేసేసింది

By:  Tupaki Desk   |   14 Aug 2017 7:40 AM GMT
పోతూ పోతూ ‘బిగ్ బాస్’ను షేక్ చేసేసింది
X
తెలుగు ‘బిగ్ బాస్’ షో నుంచి మరో పార్టిసిపెంట్ వెళ్లిపోయారు. అందరూ అనుకుంటున్నట్లుగానే గాయని కల్పన ఈ ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఈ వారం గత వారాలకు భిన్నంగా ఇద్దరు కంటెస్టెంట్లు షో నుంచి ఎలిమినేట్ కావడం విశేషం. శనివారం మహేష్ కత్తి ఔటైతే.. ఆదివారం కల్పన ఎలిమినేట్ అయింది. హరితేజ.. దీక్షా పంత్ కూడా ఎలిమినేషన్ జాబితాలో ఉండగా.. వాళ్లు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు.

ఐతే ‘బిగ్ బాస్’ షో ఆరంభం నుంచి హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ వచ్చిన కల్పన.. హౌస్ నుంచి బయటికి వచ్చాక మాత్ర తనలోని కొత్త కోణాన్ని చూపించింది. హౌస్ లోపల ఎప్పుడూ డబుల్ గేమ్ ఆడుతోందని.. కెమెరాల ముందు అతిగా నటించేస్తోందని.. అదే సమయంలో ఎవ్వరితోనూ సరదాగా ఉండట్లేదని ఆమె మీద విమర్శలుండేవి. సోషల్ మీడియాలో కల్పన మీద చాలానే ట్రోలింగ్ నడిచింది. ఐతే హౌస్ నుంచి బయటికొచ్చాక మాత్ర కల్పన విశ్వరూపం చూపించింది.

తన హౌస్ మేట్స్ ఒక్కొక్కరి గురించి పాట రూపంలో చెప్పమని ఎన్టీఆర్ అంటే.. వాళ్లలో ఒక్కొక్కరిని అద్భుతంగా అనుకరిస్తూ.. వాళ్లకు సరిపోయే పాటల్ని పాడుతూ అలరించింది కల్పన. తన మాజీ సహచరుల్ని అనుకరిస్తున్నపుడు ఆమె ఇచ్చిన హావభావాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఎవరితోనూ కలవనట్లు.. అనుమానాస్పదంగా కనిపించే కల్పన తన హౌస్ మేట్స్ ను ఇంత బాగా అబ్జర్వ్ చేసిందా.. ఆమెలో ఇంత స్కిల్ ఉందా అని అందరూ షాకైపోయారు. మొత్తంగా ఇన్నాళ్లూ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కల్పన.. వెళ్లేటపుడు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ప్రిన్స్ బిగ్ బాస్ విజేత అయ్యే అవకాశముందని చెప్పిన కల్పన.. ముమైత్ ఖాన్ షోలో ఉండటానికి అర్హురాలు కాదని అభిప్రాయపడింది. కల్పన వెళ్లిపోగానే యువ కథానాయకుడు నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లడం విశేషం.