Begin typing your search above and press return to search.
మలయాళ నటి హైదరాబాద్ లో కన్నుమూత
By: Tupaki Desk | 25 Jan 2016 11:52 AM ISTప్రముఖ మలయాళ నటి - జాతీయ అవార్డు గ్రహీత కల్పన కన్నుమూశారు. అప్పట్లో కథానాయికగా నటించి అలరించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. మలయాళ ప్రేక్షకులు చేచిగా పిలుచుకునే కల్పన తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఊపిరి సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకని హైదరాబాద్ వచ్చారు. బస చేస్తున్న హోటల్ లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆమెని అపోలో ఆస్పత్రికి తరలించినా అప్పటికే తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో దక్షిణాది చిత్రసీమలో విషాదం అలుముకుంది. ఆమె సోదరి ఊర్వశి... కల్పన భౌతిక కాయాన్ని కేరళ తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. కల్పన సహాయ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకొన్నారు. ఇటీవల ‘చార్లి` అనే చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె క్యాన్సర్ పేషెంటుగా అద్భుతమైన నటన కనబర్చారు. హస్యంతో కూడిన పాత్రల్లోనూ, విషాదభరితమైన పాత్రల్లోనూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించిన కల్పన దూరం కావడం భారతీయ చిత్ర పరిశ్రమకి తీరని లోటని మలయాళ ప్రముఖ నటులు మోహన్ లాల్ - మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు.
