Begin typing your search above and press return to search.

అర‌కులో కాజ‌ల్ ఎమ్మెల్యే అవుతుందా?

By:  Tupaki Desk   |   10 July 2020 2:00 PM IST
అర‌కులో కాజ‌ల్ ఎమ్మెల్యే అవుతుందా?
X
స్వార్థం ఆశ్రిత ప‌క్ష‌పాతం దుర్మార్గం తెలియ‌నిదే రాజ‌కీయాల్లో రాణించ‌లేరు. కేవ‌లం ప్ర‌జాసేవా కార్య‌క్ర‌మాలు చేసినంత మాత్రాన రాజ‌కీయాల్లో రాణించేస్తార‌నుకుంటే పొర‌పాటే. నాయ‌కుడు లేదా నాయ‌కిగా మెప్పించాలంటే ఏటికి ఎదురీదే ధీర‌త్వం కావాలి. అందుకేనేమో బ‌హుశా సామాజిక సేవ‌లు చేసిన క‌థానాయిక‌లంతా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి నిల‌దొక్కుకోలేక‌పోతున్నారు!

ఇంత‌కుముందు స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నాక .. జీస‌స్ భ‌క్తురాలిగా క్రిస్టియానిటీ ప్ర‌భావం ఉన్న సికింద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆ త‌ర్వాత రాజ‌కీయం త‌న‌కు సెట్ట‌వ్వ‌నే లేదు. అటు మాంద్య (క‌ర్నాట‌క‌) నియోజ‌క‌వ‌ర్గంలోనూ సుమ‌ల‌త ఎన్నో సామాజిక సేవ‌లు చేయ‌డం వ‌ల్ల‌నే రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌గ‌లుగుతున్నారు. ర‌మ్య నంబీష‌న్ లాంటి యువ నాయ‌కురాలు క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ ఎల్ల‌కాలం సాగించ‌లేక‌పోవ‌డానికి కార‌ణాల్ని ఊహించ‌గ‌లం.

ఇటీవ‌లి కాలంలో చంద‌మామ కాజ‌ల్ సామాజిక సేవ గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. అంత‌గా ప‌బ్లిసిటీ కోరుకోని కాజ‌ల్ కొన్నేళ్లుగా అర‌కు వ్యాలీలో ఓ గిరిజ‌న పాఠ‌శాల‌ను న‌డిపిస్తూ అక్క‌డ పేద విద్యార్థుల‌కు అన్న‌దానం ఇత‌ర‌ సౌక‌ర్యాల్ని క‌ల్పిస్తున్నారు. దీనికి తోడు మ‌హిళాభివృద్ధి.. ప‌డ‌తులకు క‌ష్ట‌కాలంలో ఆదుకునేందుకు చారిటీని నిర్వ‌హిస్తున్నారు. తాను సంపాదించిన దాంట్లో మెజారిటీ భాగం ఈ ర‌క‌మైన సేవాకార్య‌క్ర‌మాల‌కే కాజ‌ల్ కేటాయిస్తారు. చంద‌మామ ఎంతో క‌టువుగా పారితోషికాలు గుంజుతోంద‌ని రాసేసే తెలుగు మీడియాకి తెలియ‌ని సంగ‌తులు చాలా చాలా ఉన్నాయ‌న్న‌ది కొద్దిమందికే తెలుసు.

ఇక కాజ‌ల్ ఇంత‌గా అక్క‌డే ఎందుక‌ని సేవ చేస్తున్నారు? ఒక‌వేళ భ‌విష్య‌త్ లో అర‌కులో రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? అన్న సందేహం కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఆ క్ర‌మంలోనే అర‌కు ప్ర‌త్యేక జిల్లాగా అవ‌త‌రించ‌నుంది. ఇది కాజ‌ల్ లాంటి సామాజిక క‌ర్త‌కు సేవికురాలికి రాజ‌కీయ అవ‌కాశం క‌ల్పించే లేదా క‌లిసొచ్చే అంశంగానే భావిస్తున్నారు. కానీ కాజ‌ల్ రాజ‌కీయాల్లోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారా? అన్న‌దే అస‌లైన ప్ర‌శ్న‌. దానికి కాజ‌ల్ స్వ‌యంగా స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. రెగ్యుల‌ర్ గా అర‌కులో షూటింగుల‌కు వెళ్లే కాజ‌ల్ కి ఆ ప్రాంతం అందం అక్క‌డ ప్ర‌కృతి అంటే ఎంతో ఇష్టం. అక్క‌డ ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తార‌ట‌. అయినా భ‌విష్య‌త్ లో ఏపీ టాలీవుడ్ ని వైజాగ్-అర‌కు బెల్ట్ లోనే ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది. అలా జ‌రిగితే అక్క‌డ రాజ‌కీయ ప్రాబ‌ల్యం కూడా మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ఆస్కారం ఉంటుంది. కాజ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా త‌ప్పేమీ కాదు. `అందం అంటే బౌతికంగా క‌నిపించేది కాదు.. బ‌య‌టికి క‌నిపించ‌ని మంచి మ‌న‌సు.. గొప్ప‌ సేవ‌` అని భావిస్తున్న చంద‌మామ కాజ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే త‌ప్పేమీ కాదు క‌దా! అనేది త‌న అభిమానుల మాట‌. మ‌రి దీనికి చంద‌మామ స‌మాధానం ఇస్తుందా లేదా చూడాలి.