Begin typing your search above and press return to search.

కరోనా సాయానికి ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 April 2020 6:36 PM IST
కరోనా సాయానికి ముందుకొచ్చిన స్టార్ హీరోయిన్
X
కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ వస్తున్నారు. అదొక్కటే సరిపోదని భావించి దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో పనులు లేక ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. వీరికి తోడుగా మేము కూడా ఉన్నామంటూ రాజకీయ సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. మన టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఎప్పటిలాగే కష్టమొస్తే మేము మీ వెంటే అంటూ విరాళాలు ప్రకటించారు.

కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ 'మనకోసం'ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి చిరంజీవి చైర్మన్ గా వ్యవహరించగా సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, డైరెక్టర్ ఎన్.శంకర్, ప్రముఖ నిర్మాతలు సురేష్‌ బాబు, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. కానీ ఒకరిద్దరు హీరోయిన్స్ తప్ప స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఇంత‌వ‌ర‌కు క‌రోనా క్రైసిస్ ఫండ్ కు విరాళం ఇవ్వ‌డానికి ముందుకు రాలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముందుకొచ్చి తన మంచి మనసు చాటుకుంది.

కరోనా క్రైసిస్ ఛారిటీకి కాజ‌ల్ అగర్వాల్ 2 ల‌క్ష‌లు విరాళం ఇచ్చింది. అయితే విరాళం ప్రకటించడానికి ఎందుకని ఇంత టైమ్ తీసుకున్నారని కాజల్ టీమ్ ని అడిగితే.. స్టార్ హీరోయిన్లు చాలా మంది తెలుగుతో పాటు ఇతర భాష‌ల్లో కూడా న‌టిస్తున్నారు. దీంతో ఒక ఛారిటీకి విరాళం ఇచ్చి మ‌రొక‌రికి ఇవ్వ‌క‌పోతే ఆ త‌రువాత ప్రాబ్ల‌మ్స్ వ‌స్తాయ‌నే ఉద్దేశంతో చాలా మంది వెన‌క‌డుగు వేస్తున్న‌ట్లుగా చెప్పారట. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన ఫండ్ కూడా త‌న‌కు తెలుగు ఇండ‌స్ట్రీ మీద ఉన్న అభిమానంతో.. తాను ఈ ఇండ‌స్ట్రీ నుంచే పైకి ఎదగడంతో.. కాజ‌ల్ మిగ‌తా ఇండ‌స్ట్రీలు గురించి ఆలోచించ‌కుండా ఈ ఛారిటీకి సాయం చేసిన‌ట్లుగా తెలిపారట.

సరే కాజ‌ల్ ని కాసేపు ప‌క్క‌న పెడితే మిగతా హీరోయిన్లు చెబుతున్న ఈ సాకు మాత్రం అభిమానులకు అంత‌గా రుచించ‌డం లేదట. కారణం ప్రాంతాల వారీగా విరాళమిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌న‌కుంటే డైరెక్టుగా పీఎం రిలీఫ్ ఫండ్ కు అయినా ఇవ్వొచ్చుగా అంటున్నారట. ఏదేమైనా వారికి తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకొస్తున్న వారిని అభినందించాలి. మరి కాజల్ అగర్వాల్ ని చూసైనా ఇప్పటికైనా మిగిలిన స్టార్ హీరోయిన్స్ కరోనాపై సాయానికి ముందుకొస్తారేమో చూడాలి.