Begin typing your search above and press return to search.

'ఆచార్య' నుంచి కాజల్ ను తొలగించడం వెనుక అసలు కారణం వేరే ఉందా..?

By:  Tupaki Desk   |   27 April 2022 8:00 AM IST
ఆచార్య నుంచి కాజల్ ను తొలగించడం వెనుక అసలు కారణం వేరే ఉందా..?
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా విడుదలకు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. ఇందులో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు కు జోడీ లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

నిజానికి 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా ముందుగా త్రిష ను ఎంపిక చేసుకున్నారు. ఆమె తప్పుకోవడంతో కాజల్ అగర్వాల్ ని బోర్డ్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసారు. 'లాహే లాహే' అనే పాటలోనూ సందడి చేసింది. అయితే సినిమాలో కాజల్ పాత్రను పూర్తిగా తీసేసామని చెప్పి కొరటాల బాంబ్ పేల్చాడు. నక్సలిజం సిద్ధాంతాలున్న పాత్రకు లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదనిపించిందని తొలగించాలని తెలిపారు.

సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్ తో చేయించడం భావ్యం కాదనిపించిందని దర్శకుడు పేర్కొన్నారు. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు.. సరైన ముగింపు కూడా లేదు. అంత పెద్ద హీరోయిన్ తో అలాంటి పాత్ర చేయించడం కరెక్ట్ కాదనిపించిందన్నారు.

ఇవన్నీ ఆలోచించి చిరంజీవి గారితో చెబితే.. కథకు ఏది అవసరమో అదే చెయ్యమన్నారు. ఇందుకు కాజల్ కూడా చాలా పెద్ద మనసుతో ఒప్పుకుంది అని కొరటాల వివరించారు. అయితే 'ఆచార్య' సినిమా నుంచి హీరోయిన్ పాత్రను తొలగించడానికి కారణమిదని దర్శకుడు చెబుతుంటే.. దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. 'ఆచార్య' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సందర్భంలో కన్నెగంటి అనిల్ కృష్ణ అనే వర్ధమాన రచయిత ఈ సినిమా కథ తనదేనంటూ ఆరోపణలు చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2006లో 'పుణ్యభూమి' అనే టైటిల్ తో తాను ఓ కథను రిజిస్ట్రేషన్ చేయించానని.. మోషన్ పోస్టర్ లో కనిపిస్తున్న 'ధర్మస్థలి' అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి ప్రేరణ పొందారని అనిల్ కృష్ణ పేర్కొన్నారు.

అదే సమయంలో 'ఆచార్య' సినిమా కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే మరో రచయిత మీడియా ముందుకు వచ్చారు. బి. గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్.. తాను రాసుకున్న కథని అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ కు వినిపిస్తే.. ఆ ఐడియా అక్కడి నుంచి కొరటాలకు చేరిందని ఆరోపించారు.

'ఆచార్య'కాపీ మరకలపై అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగింది. అయితే దీనిపై 'ఆచార్య' దర్శక నిర్మాతలు స్పందిస్తూ.. ఆరోపణలను కొట్టి పారేశారు. అవన్నీ అసత్య ఆరోపణలని.. ఇది కొరటాల రాసిన ఒరిజినల్ స్టోరీ అని.. కాపీ కథ కాదని వివరణ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పట్లో కొన్నాళ్ళపాటు వార్తల్లో నిలిచిన ఈ వివాదం గురించి ఆ తర్వాత అందరూ మర్చిపోయారు.

అయితే ఇప్పటి వరకు 'ఆచార్య' సినిమా రిలీజ్ తర్వాత ఒకవేళ నిజంగానే వేరే కథలతో పోలికలు ఉంటే మళ్లీ ఆ వివాదం తెర పైకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి కాపీ ఆరోపణల తలనొప్పులు ఏమీ లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతో.. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత స్క్రిప్టులో కొన్ని చేంజెస్ చేసారని టాక్ నడుస్తోంది.

ఇందులో భాగంగా అనుభవజ్ఞుడైన చిరంజీవి.. సినిమాలో హీరోయిన్ పాత్రను పూర్తిగా తొలగించాలని దర్శకుడికి సూచించారని అనుకుంటున్నారు. దీంట్లో నిజమెంతో తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.