Begin typing your search above and press return to search.

ఆ సినిమాపై స్పందించి చిక్కుల్లో పడింది

By:  Tupaki Desk   |   9 April 2019 9:20 AM GMT
ఆ సినిమాపై స్పందించి చిక్కుల్లో పడింది
X
సెలబ్రెటీలు ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వారు మాట్లాడే మాట చాలా మందికి రీచ్‌ అవ్వడంతో పాటు, వారిపై ప్రభావం చూపుతుంది. అందుకే సెలబ్రెటీలు సోషల్‌ మీడియాలో కొన్ని సార్లు చేసిన అనాలోచిత వ్యాఖ్యలు, పోస్ట్‌ లు సంచలనానికి తెర తీస్తాయి. కొన్ని వివాదాస్పదం అవుతాయి. గతంలో కాజల్‌ కొన్ని సార్లు చేసిన పోస్ట్‌ లు వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. తాజాగా కాజల్‌ చేసిన పోస్ట్‌ మళ్లీ ఆమెను చిక్కుల్లో పడేసింది.

అసలు విషయం ఏంటీ అంటే.. ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ 'పీఎం నరేంద్ర మోడీ' తెరకెక్కిన విషయం తెల్సిందే. సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్‌ ను మోడీ పాత్రను పోషించిన బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబేరాయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌, పోస్టర్‌ కు కాజల్‌ స్పందిస్తూ... సినిమా చాలా బాగుంటుందని నమ్ముతున్నాను, సినిమాను చూడ్డం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, మీకు, చిత్ర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ చేసింది.

కాజల్‌ 'పీఎం నరేంద్ర మోడీ' సినిమాపై చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం కొందరు తమిళనాడు జనాలకు మింగుడు పడటం లేదు. మోడీకి మద్దతుగా ఉన్న ఆమె మాటలతో ఆమె ఏంటో వెళ్లడయ్యింది. అందుకే కాజల్‌ సినిమాలను తమిళంలో బ్యాన్‌ చేయాలంటూ స్టాలిన్‌ కు చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతో కాజల్‌ ఇలాంటి కామెంట్స్‌ చేసి ఉంటుందా అని కొందరు, ఇది కాజల్‌ చేసిన ఎన్నికల ప్రచారం అయ్యి ఉంటుందని మరి కొందరు, ఈ చిత్రంలో ఏం ఉంటుంది, అసలు ఎందుకు దీన్ని ఇప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారనే విషయం మీకు తెలుసా అంటూ మరి కొందరు కాజల్‌ పోస్ట్‌ పై విరుచుకు పడ్డారు. మొత్తానికి కాజల్‌ చేసిన ఆ ట్వీట్‌ కు పెద్ద ఎత్తున నిరసన రీ ట్వీట్స్‌ వస్తున్న నేపథ్యంలో కాజల్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.