Begin typing your search above and press return to search.

కాజల్‌ సమర్పించు.. షూటింగ్‌ పూర్తి

By:  Tupaki Desk   |   19 Oct 2021 7:00 PM IST
కాజల్‌ సమర్పించు.. షూటింగ్‌ పూర్తి
X
హీరోయిన్‌ గా సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత నటిగా బిజీగా ఉండాలని కోరుకుంది. అనూహ్యంగా ఆమె పెళ్లి తర్వాత కరోనా వల్ల ఆమె సినిమాలు ఏమీ కూడా పట్టాలెక్కలేదు. పైగా ఆమె గర్బవతి అనే వార్తలు కూడా మొదలు అయ్యాయి. దాంతో కాజల్‌ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమద్య కాలంలో హీరోయిన్స్ అంటే కేవలం హీరోయిన్‌ లుగా మాత్రమే కనిపించడం లేదు.. వారు నిర్మాతలుగా దర్శకులుగా కూడా మారుతున్నారు. తమకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకుని ఇతరుల సినిమాలను కూడా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అనే టాక్ వస్తోంది.

తాజాగా కాజల్‌ అగర్వాల్‌ 'మనుచరిత్ర' అనే సినిమాకు సమర్పకురాలిగా వ్యవహించేందుకు సిద్దం అయ్యింది. కాజల్‌ సమర్పిస్తున్న మను చరిత్ర సినిమా షూటింగ్‌ గతంలోనే ప్రారంభం అయ్యింది. ఆ సినిమా ప్రారంభోత్సవంలో కాజల్ సందడి చేసింది. కాజల్ మరియు ఇతర యూనిట్‌ సభ్యులు కలిసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. విడుదలకు సిద్దం అవుతున్న మను చరిత్రను మరోసారి కాజల్‌ పేరుతో పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. కాజల్‌ ఈ సినిమా విడుదల సందర్బంగా ప్రమోషన్స్‌ కోసం వస్తుందా అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆమె గర్బవతి అంటూ వార్తలు వస్తున్నాయి. కనుక ఆ విషయంలో ఒక క్లారిటీ దీంతో వస్తుందని అంటున్నారు.

మను చరిత్ర సినిమా లో హీరోగా శివ కందుకూరి నటించగా హీరోయిన్ గా మేఘ ఆకాష్ నటించింది. వీరిద్దరి కాంబోలో రూపొందిన మను చరిత్ర మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు హీరోయిన్‌ గా మంచి విజయాలను దక్కించుకున్న కాజల్‌ మొదటి సారి ఈ సినిమాను ప్రజెంట్‌ చేయబోతుంది. కనుక సినిమా ఎలా ఉంటుంది.. సమర్పకురాలిగా కాజల్‌ సక్సెస్‌ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. కాజల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ మను చరిత్రకు జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. భరత్‌ పెదగని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నరాల శ్రీనివాస్ రెడ్డి నిర్మించాడు. విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. షూటింగ్‌ కంప్లీట్‌ అంటూ విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇవ్వబోతున్నారు.