Begin typing your search above and press return to search.

గడ్డం బాబు గట్టిగానే కొట్టాడు..

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:25 PM IST
గడ్డం బాబు గట్టిగానే కొట్టాడు..
X
వెలుగు విలువ తెలియాలంటే చీకటి భయం కూడా రుచి చూసుండాలి. అలానే తెలుగు సినిమాలలో కధానాయకుడి హీరోయిజం పండాలంటే దానికి సమవుజ్జీ అయిన విలన్ కూడా ఎదురుగా వుండాలి. మరే ఇతర ఇండస్ట్రీలో లేని ప్రాధాన్యత తెలుగు సినిమాలో విలన్లకు మాత్రమే వుంటుందనడం ఆశ్చర్యం కాదు. రామిరెడ్డి దగ్గర నుండి సోనూ సూద్ వరకూ ప్రేక్షకులను అలరించిన ప్రతినాయకులు ఎందరో..

అయితే ఈ మధ్య టాలీవుడ్ కి నయా విలన్లు దొరకడంలేదనే వాదన తరచూ వినిపిస్తుంది. వాటిని మట్టి కరిపిస్తూ 'జిల్' సినిమాతో తెరారంగ్రేటం చేసిన కభీర్ సింగ్ వరుసపెట్టి అవకాశాలను సంపాదిస్తున్నాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించిన కబీర్ ఆ తరువాత ఇటీవల విడుదలైన కిక్ 2లో నెగిటివ్ రోల్ లో కనిపించాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం మనోడు బంపర్ ఆఫర్ కొట్టినట్టు తెలుస్తుంది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలలో కబీర్ నటిస్తున్నాడు. బాలకృష్ణ ప్రతిష్టాత్మక 99వ సినిమా 'డిక్టేటర్' మరియు పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలలో కబీర్ విలన్ గా కనువిందు చేయనున్నాడు. ఈరెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే అమాంతం టాప్ పొజిషన్ కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.