Begin typing your search above and press return to search.

సీనియర్ డైరెక్టర్ ఎందుకలా అయిపోయాడు?

By:  Tupaki Desk   |   23 Feb 2016 10:00 AM GMT
సీనియర్ డైరెక్టర్ ఎందుకలా అయిపోయాడు?
X
లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ ఎప్పుడూ ఒకే రకమైన లుక్ లో కనిపిస్తుంటారు. నీట్‌ గా జుట్టు కత్తిరించుకుని.. షేవింగ్ చేయించుకుని.. ఫార్మల్ డ్రెస్సులో టక్ చేసుకుని చాలా పద్ధతిగా కనిపిస్తుంటారాయన. గత రెండు మూడు దశాబ్దాలుగా విశ్వనాథ్ ను అలాగే చూస్తున్నారు జనాలు. కానీ ఈ మధ్య ఆయన ఉన్నట్లుండి అవతారం మార్చేశారు. గడ్డం - మీసం పెంచేసి.. ముతక చొక్కా వేసుకుని.. లుంగీ కట్టుకుని ఓ ప్రధాన పత్రిక ఇంటర్వ్యూలో కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త లుక్ వెనుక కారణమేంటి అని ఆ ఇంటర్వ్యూలోనే అడిగారు కానీ.. ఆయన సమాధానం దాటవేశారు. తాజాగా మరోసారి ఓ కార్యక్రమంలో ఆయనకు ఇదే ప్రశ్న సంధించారు విలేకరులు.

ఏదైనా సినిమా కోసం ఇలా వేషం మార్చారా అని అడిగితే.. ‘‘కాదు.. ఈ లుక్ చూసి కొత్తగా ఏదైనా అవకాశాలిస్తారేమో అని ఇలా తయారయ్యా’’ అని చమత్కరించారు విశ్వనాథ్. మొత్తానికి మరోసారి అసలు విషయం చెప్పకుండానే సమాధానం దాటవేశారు పెద్దాయన. ఐతే విశ్వనాథ్ ఇలా అవతారం మార్చడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ ఉండదేమో.. సరదాకి అలాంటి లుక్ లో కనిపిస్తున్నారేమో అనుకుని ఆ సంగతి అలా వదిలేయాల్సిందే. శంకరాభరణం - సాగరసంగమం - స్వాతిముత్యం - స్వాతికిరణం - స్వయంకృషి లాంటి అత్యద్భుత చిత్రాలను అందించి.. ఆ తర్వాత నటుడిగానూ గొప్ప పాత్రలు పోషించిన విశ్వనాథ్.. ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరమై ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.