Begin typing your search above and press return to search.

జ్యో అచ్యుతానంద.. క్యాప్షన్ అదిరింది

By:  Tupaki Desk   |   11 Sep 2016 7:30 AM GMT
జ్యో అచ్యుతానంద.. క్యాప్షన్ అదిరింది
X
‘మనమంతా’ మంచి సినిమా. కానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. విడుదలకు ముందు.. తర్వాత సరైన ప్రమోషన్ చేయకపోవడమే కారణం అన్న అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘జ్యో అచ్యుతానంద’కు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటున్నాడు సాయి కొర్రపాటి. విడుదలకు ముందు నుంచే సినిమాకు బాగా పబ్లిసిటీ చేశారు. విడుదల రోజు ఈ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది. ఈ టాక్ కు తగ్గట్లుగా ప్రమోషన్ కూడా బాగా చేసి.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి మంచి ప్రయత్నమే చేస్తున్నాడు సాయి. విడుదల రోజు సాయంత్రం నుంచే పబ్లిసిటీ జోరందుకుంది. వెబ్.. ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఆ ప్రకటనలు కూడా సినిమా గురించి మంచి అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి.

ఇవాళ పత్రికల్లో ‘జ్యో అచ్యుతానంద’ గురించి చక్కటి క్యాప్షన్ ఇచ్చారు. దోసెడు నవ్వులు.. చిటికెడు కన్నీళ్లు.. ఇదీ ఆ క్యాప్షన్. ఈ ఆలోచన ఎవరిదో కానీ.. రెండు మాటల్లో సినిమా గురించి చక్కగా చెప్పేశారు. సినిమా చాలా వరకు వినోదాత్మకంగా ఉంటుంది. నవ్విస్తుంది.. కవ్విస్తుంది. చివర్లో మాత్రం ఎమోషనల్‌ సాగి.. హృదయాల్ని టచ్ చేస్తుంది. క్లైమాక్స్ చూశాక మనసున్న ఏ ప్రేక్షకుడికైనా కంట్లో చిన్న తడి రాక మానదు. మొత్తంగా నవ్వించి.. కదిలించే ఈ సినిమాకు ‘దోసెడు నవ్వులు.. చిటికెడు కన్నీళ్లు’ అన్నది పర్ఫెక్ట్ క్యాప్షన్. ఫస్ట్ వీకెండ్లో మంచి వసూళ్లు సాధించిన ‘జ్యో అచ్యుతానంద’ వీకెండ్ తర్వాత కూడా స్టడీగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరాల శ్రీనివాస్ ఖాతాలో మరో హిట్టు పడినట్లే.