Begin typing your search above and press return to search.

మెగా అభిమానులకు మరపురాని రోజు

By:  Tupaki Desk   |   24 July 2018 2:30 PM GMT
మెగా అభిమానులకు మరపురాని రోజు
X
జులై అంటేనే మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన నెల. అందులోనూ జులై 24 అంటే వారికి మరింత స్పెషల్. తెలుగు సినిమా చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిన రెండు ప్రత్యేకమైన ‘మెగా’ సినిమాలు ఈ రోజే రిలీజయ్యాయి. చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్‌ గా మారడానికి పునాది వేసిన ‘తొలి ప్రేమ’ రిలీజైంది ఈ రోజే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ చిత్రం రిలీజైంది. అప్పటికే పవన్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.. ‘గోకులంలో సీత’.. ‘సుస్వాగతం’ బాగానే ఆడాయి కానీ.. అవి అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టలేదు. అతడికంటూ ప్రత్యేకమైన గుర్తింపునివ్వలేదు. ఐతే కరుణాకరన్ రూపొందించిన ‘తొలి ప్రేమ’ పవన్ జీవితాన్నే మార్చేసే విజయాన్నందించింది. తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం యువతను ఒక ఊపు ఊపేసింది.

పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన చిత్రం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఇరగాడేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘తొలి ప్రేమ’ తర్వాత పవన్ కెరీర్ ఎలా దూసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. ఇక ఇదే రోజున మెగాస్టార్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ కూడా రిలీజైంది. ఆ చిత్రం ఈ రోజుతో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ‘అంజి’ సినిమా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సమయంలో చిరు.. ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బి.గోపాల్ తో ‘ఇంద్ర’ చేశాడు. అగ్ర నిర్మాత అశ్వినీదత్ నిర్మాణంలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. వసూళ్లలో.. శత దినోత్సవ కేంద్రాల సంఖ్యలో కొత్త రికార్డులు నెలకొల్పింది. బాలీవుడ్ సినిమాలకు దీటుగా ఇది భారీ విజయం సాధించి చిరు స్టామినా ఏంటో దేశం మొత్తానికి చాటి చెప్పింది. చిరు.. పవన్ కెరీర్లలో మైలురాళ్లుగా నిలిచిన రెండు సినిమాలూ ఒకే రోజున రిలీజవడం విశేషమే. అందుకే ఈ రోజు మెగా అభిమానులకు ప్రత్యేకం.