Begin typing your search above and press return to search.

రెస్టులో తారక్ భాయ్ .. ఫైటులో చరణ్ భాయ్!

By:  Tupaki Desk   |   6 Feb 2019 9:35 AM GMT
రెస్టులో తారక్ భాయ్ .. ఫైటులో చరణ్ భాయ్!
X
ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేక్షకుల చూపు రాజమౌళి రూపొందిస్తున్న #RRR పై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 'బాహుబలి' తర్వాత ఆ రికార్డులను తలదన్నే సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూడడం.. అవి కాస్తా బాల్చీ తన్నేయ్యడం కామన్ కావడంతో జనాలు కూడా #RRR కు ఇచ్చే ప్రాధాన్యత మిగతా భారీ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదు.

రాజమౌళి సినిమా క్రేజు అందరికీ తెలిసిందే కాబట్టి మనం అసలు విషయం మాట్లాడుకుందాం. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపుగా చరణ్ .. తారక్ ఇద్దరూ కలిసే షూటింగ్ లో పాల్గొంటూ వచ్చారట. కానీ మొదటి సారి జక్కన్న నందమూరి హీరోకు బ్రేకిచ్చి కొణిదెలవారికి మాంచి రౌడీలను తగిలించి ఫైట్ చెయ్యమని చెప్పాడట. అందుకే ఎన్టీఆర్ బ్రేక్ లో ఉంటే చరణ్ మాత్రం చెమటోడుస్తూ ఆ మొరటురౌడీల పనిపట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాడట. ఈ సీన్ లో పదుల సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా ఒక పోలీస్ చెక్ పోస్ట్ సెట్ వేశారట. ఆ స్పెషల్ సెట్ లోనే ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం.

ఈ అప్డేట్ సంగతి ఇలా ఉంటే రాజమౌళి గానీ అయన టీమ్ గానీ ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు.. ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలను చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారని.. ఈ హీరోయిన్ ను తీసుకున్నారని జోరుగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయిగానీ జక్కన్న స్వయంగా వెల్లడించేవరకూ మనకు సస్పెన్స్ తప్పదు.