Begin typing your search above and press return to search.

ఆ స్టోరీకి ఎన్టీఆర్ ఒక్కడే సెట్ అవుతాడట...!

By:  Tupaki Desk   |   6 May 2020 2:40 PM IST
ఆ స్టోరీకి ఎన్టీఆర్ ఒక్కడే సెట్ అవుతాడట...!
X
‘బాహుబలి’ తర్వాత దక్షిణాది నుండి ప్యాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాతో మన టాలీవుడ్ స్టార్ హీరోల చూపు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై పడింది. మహేష్ బాబు - ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ప్రశాంత్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రం ఖచ్చితంగా తెలుగు హీరోతో ఉంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం.. మరోవైపు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ చేస్తుండడంతో ఆ కాంబినేషన్స్ ముందుకు కదలలేదు. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ సినిమా కోసం ప్రశాంత్ తో ఒప్పందం చేసుకుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఉంటుందని.. మహేష్ తో ఉంటుందని గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అయితే దర్శకుడు ప్రశాంత్‌ ఎంచుకున్న కథకు ఎన్టీఆర్‌ ఒక్కరే సరైన వాడని నిర్ణయించుకున్నారట. ఈ కథను ఎన్టీఆర్‌ అంగీకరిస్తే ప్రశాంత్‌ తెలుగులో తీయబోయే మొదటి చిత్రం అవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కెరీర్లో 30వ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు).. నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మొత్తం మీద ఒకప్పుడు హీరోల్లో సరైన లైనప్ లేదు అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలు చేతిలో వుంచుకున్నాడు. అంతేకాకుండా ఇకపై ప్రతి సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా పార్టనర్ గా వ్యవహరించబోతుందట. కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాల షూటింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.